ప్రజలకు నిస్పాక్షిక సేవలే పోలీసుల ప్రధాన బాధ్యత
భూపాలపల్లి జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్
చిట్యాల పోలీస్ స్టేషన్ లో వార్షిక తనిఖీ
వన మహోత్సవంలో మొక్కలు నాటిన ఎస్పి
భూపాలపల్లి/ చిట్యాల,(విజయక్రాంతి): ప్రజలకు నిస్పాక్షిక సేవలే పోలీసుల ప్రధాన బాధ్యతని భూపాలపల్లి జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ అన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా భూపాలపల్లి జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, మంగళవారం చిట్యాల సర్కిల్ కార్యాలయం, పోలీస్ స్టేషన్‌ను సందర్శించారు. స్టేషన్‌కు చేరుకున్న ఎస్పీకి సిబ్బంది గౌరవ వందనం సమర్పించారు. అనంతరం వన మహోత్సవంలో భాగంగా స్టేషన్ ప్రాంగణంలో మొక్క నాటారు.
ఈ సందర్భంగా స్టేషన్ పరిశుభ్రత, రికార్డుల నిర్వహణ, సిబ్బంది విధి నిర్వహణతో పాటు పెండింగ్ కేసులు, సీసీటీఎన్‌ఎస్ నమోదు, బ్లూ కోల్ట్ వాహనాల పనితీరు, సీసీ కెమెరాల పనితీరును ఎస్పీ సమీక్షించారు. స్టేషన్ పరిధిలోని సీసీ కెమెరాలు నిరంతరం పనిచేసేలా పర్యవేక్షించాలని, లోపాలను వెంటనే సరిచేయాలని అధికారులను ఆదేశించారు.
రిసెప్షన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదును వెంటనే ఆన్‌లైన్‌లో నమోదు చేసి, దర్యాప్తు పురోగతిని ఎప్పటికప్పుడు సీసీటీఎన్‌ఎస్‌లో నవీకరించాలని సూచించారు. రౌడీ షీటర్లపై నిరంతర నిఘా కొనసాగిస్తూ, ప్రజలకు స్నేహపూర్వకంగా, పారదర్శకంగా సేవలు అందించాలని ఎస్పీ ఆదేశించారు. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి నిస్పాక్షికంగా సేవలు అందించాలని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ సూచించారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి డీఎస్పీ సంపత్ రావు, చిట్యాల సీఐ మల్లేష్ యాదవ్ తదితర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.






