22 April, 2026 | 8:57 PM

గజ్వేల్ మహిళా డిగ్రీ కళాశాలలో ఘనంగా వార్షికోత్సవం

22-04-2026 07:08 PM

గజ్వేల్: గజ్వేల్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో బుధవారం వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వార్షిక నివేదికను సమర్పించారు. కళాశాల అభివృద్ధిలో భాగంగా 45 కంప్యూటర్లు, యూపీఎస్, రెండు ప్రొజెక్టర్లు సమకూర్చినట్లు తెలిపారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో డిగ్రీ ప్రథమ సంవత్సరంలో 345 మంది ప్రవేశాలు నమోదవగా, ఫైనల్ ఇయర్‌లో 81 శాతం ఉత్తీర్ణత సాధించడం విశేషమన్నారు. మెగా జాబ్ మేళా ద్వారా టెక్ మహేంద్ర, జయాలుకాస్, ముత్తూట్ ఫైనాన్స్ తదితర సంస్థల్లో 105 మంది విద్యార్థినులు ఉద్యోగాలు సాధించారని వెల్లడించారు.

సీపీడీసీ సభ్యురాలు డాక్టర్ శైలజ 25 కుర్చీలు, ఆరాధన జార్జి 40 స్టూల్స్‌ను విరాళంగా అందజేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన మున్సిపల్ మాజీ చైర్మన్ ఎస్. రాజమౌళి, డాక్టర్ శైలజ, డాక్టర్ నరేష్ బాబు, డాక్టర్ శ్రీధర్, లయన్స్ క్లబ్ అధ్యక్షుడు పరమేశ్వర చారి, సామాజిక సేవాకర్త టి. లక్ష్మణ్ విద్యార్థినులకు జీవన లక్ష్యాలు, విలువలు, భవిష్యత్ దిశలపై మార్గనిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా బీఏ, బీకాం, బీఎస్సీ విభాగాల్లో టాపర్లుగా నిలిచిన భానుజా, ఫిరదౌస్ బేగం, పల్లవి, సింధు, శబ్నం, శ్రావణి, శ్యామశ్రీ, భవాని, రచనలను బంగారు పతకాలతో సత్కరించారు. అలాగే ఎన్ఎస్ఎస్, క్రీడలు, సాంస్కృతిక, సాహిత్య, వర్క్‌షాప్‌లలో ప్రతిభ కనబరిచిన విద్యార్థినులకు బహుమతులు ప్రదానం చేశారు.

కళాశాల మ్యాగజైన్‌ను సీపీడీసీ సభ్యుల సమక్షంలో ఆవిష్కరించారు. అనంతరం ఫేర్‌వెల్ వేడుకల్లో విద్యార్థినులు నృత్యాలు, పాటలు, ఏకపాత్రాభినయాలతో అలరించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ కమలా క్రిస్టియాన, అకాడమిక్ కోఆర్డినేటర్ డాక్టర్ ఉమారాణి, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ ఎంఎం లక్ష్మి, స్టాఫ్ క్లబ్ సెక్రటరీ డాక్టర్ శోభారాణి, అధ్యాపకులు, తల్లిదండ్రులు, సిబ్బంది పాల్గొన్నారు.