సంగీత ప్రయాణంలో అనిరుధ్ ముందడుగు
ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ స్థాపించిన కొత్త రికార్డ్ లేబుల్ ‘అల్బుకర్క్యూ రికార్డ్స్’. దీని ద్వారా అనిరుధ్ తన సినిమేతర సంగీతాన్ని ప్రేక్షకులకు అందుబాటులోకి తీసుకు రానున్న ఈ లేబుల్ ఇప్పుడు మరో ముందడుగు సాధించింది. సంగీత రంగంలో ప్రపంచ అగ్రగామి సంస్థ అయిన యూనివర్సల్ మ్యూజిక్ గ్రూప్‌నకు చెందిన విభాగం యూనివర్సల్ మ్యూజిక్ ఇండియా.. ప్రముఖ గాయకుడు, -సంగీత దర్శకుడు అనిరుధ్ రవి చందర్ ఇటీవల ప్రారంభించిన స్వతంత్ర రికార్డ్ లేబుల్ ‘అల్బుకర్క్యూ రికార్డ్స్’తో ప్రత్యేక భాగ స్వామ్యాన్ని ప్రకటించింది.
ఈ భాగస్వామ్యం ద్వారా యూనివర్సల్ మ్యూజిక్ ఇండియా, అల్బుకర్కీ రికార్డ్స్, అనిరుధ్ రవిచందర్ రూపొందించిన భవిష్యత్ పాప్, హిప్-హాప్ సంగీతాన్ని, ఈ లేబుల్‌కు భవిష్యత్తులో చేరుతుంది. ఈ లేబుల్ కింద విడుదలయ్యే తొలి సంగీత ప్రాజెక్టులో అనిరుధ్ పాల్గొనగా, దాన్ని ఏప్రిల్ ప్రారంభంలో విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. తాజా భాగస్వామ్యంపై యూనివర్సల్ మ్యూజిక్ ఇండియా చైర్మన్, సీఈవో దేవరాజ్ సన్యాల్ స్పందించారు.
“అనిరుధ్ రవిచందర్ భారతీయ సంగీత భవిష్యత్తును ప్రతిబింబించే కళాకారుడు. భారతీయ సంగీతాన్ని ప్రపంచ వేదికపై మరింత ముందుకు తీసుకెళ్లడంలో ఆయన కీలక పాత్ర పోషిస్తారని మేము ఆశిస్తున్నాం” అన్నారు. అనిరుధ్ రవిచందర్ మాట్లాడుతూ.. “అల్బుకర్క్యూ రికార్డ్స్‌ను కళాకారుల ఆధ్వర్యంలో నడిచే స్వదేశీ రికార్డ్ లేబుల్‌గా, స్వతంత్ర ప్రతిభను ప్రోత్సహిస్తూ వారి సంగీతాన్ని ప్రపంచ వేదికపైకి తీసుకెళ్లాలనే లక్ష్యంతో స్థాపించాం.
పాప్, హిప్-హాప్ సంగీత రంగాల్లో యూనివర్సల్ మ్యూజిక్ ఇండియా చూపిస్తున్న నాయకత్వం వారిని సహజ భాగస్వామిగా మార్చింది. భారతదేశంలోని స్వతంత్ర కళాకారుల కొత్త తరాన్ని ముందుకు తీసుకువచ్చి, వారి స్వరాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రోతలకు పరిచయం చేయడానికి నేను ఎంతో ఉత్సాహంగా ఉన్నాను” అని తెలిపారు.




