26 February, 2026 | 4:40 PM

ఉగ్రవాదంపై ఉక్కుపాదం!

25-02-2026 12:00 AM

దేశంలోకి ఉగ్రవాదం చొరబడకుండా గస్తీ కాసే సైనికులకు అండగా, ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ‘ప్రహార్’ పేరుతో ఉగ్రవాద వ్యతిరేక విధానాన్ని తీసుకురావడం శుభపరిణామం. బహుముఖ వ్యూహాన్ని ఆవలంబిస్తూనే ఉగ్రవాదాన్ని సహించరాదన్నది ఇందులో మూలాంశం. నిఘా ఆధారంగా ఉగ్రవాద హింసను నిరోధించడం, ఉగ్రవాదులకు ఆర్థిక సాయం చేసేవారికి, మద్దతుదారులకు నిధులు, ఆయుధాలు, ఆశ్రయం అందకుండా చేయడం ప్రహార్ ఉద్దేశ్యమని కేంద్రం వివరించింది. ఉగ్రవాద నిరోధం, ప్రతిస్పందన, అంతర్గత సామర్థ్యాల పెంపు, మానవహక్కులు, చట్టబద్ధమైన పాలన; అంతర్జాతీయ సహకారం, మత ఛాందస భావనల కట్టడి, పునరావాసం వంటి ఏడు అంశాలను మూల స్తంభాలుగా చేసుకొని ప్రహార్‌ను రూపొందించినట్లు హోంశాఖ వెల్లడించింది.

నిజానికి ఉగ్రవాదం భారత్‌ను ఎప్పటినుంచో వేధిస్తున్న సమస్య. స్వతంత్ర భారతదేశంలో ఎన్నోసార్లు ఉగ్రశక్తులు మన దేశంపై విరుచుకుపడి అమాయక ప్రజల ప్రాణాలు పొట్టనబెట్టుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. అయితే ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్ వంటి దేశాల నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి సరిహద్దు వద్ద భద్రతా బలగాలు నిరంతర గస్తీకి తోడు, ఎప్పటికప్పుడు ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటూనే వస్తున్నాయి. అయినప్పటికీ కొన్ని మతఛాందస శక్తులు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ భారత్‌ను ప్రమాదకర స్థితిలోకి నెట్టేస్తున్నాయి.

2001 పార్లమెంట్ దాడి, 2008 ముంబై ఉగ్రదాడి ఉదంతాలు ఇందుకు సాక్ష్యాలు. అల్‌ఖైదా, ఇస్లామిక్ స్టేట్ వంటి ఉగ్రవాద సంస్థలు భారత్‌లోకి అక్రమంగా చొరబడి స్లీపర్ సెల్స్ ద్వారా దేశంలో హింసను ప్రేరేపించడానికి ప్రయత్నిస్తుండడంతో, ఇప్పటికీ దేశంలో ఎక్కడో ఒకచోట ఉగ్రకుట్రలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా పాక్ ఐఎస్‌ఐతో పాటు బంగ్లాదేశ్ అతివాద సంస్థలతో సంబంధాలున్న 8 మందిని ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరితో పాక్ ప్రేరేపిత ఉగ్రసంస్థ లష్కరే తోయిబా భారత్‌లో భారీ ఉగ్రదాడులకు ప్రణాళిక రచించినట్లు నిఘా వర్గం హెచ్చరించింది.

విదేశీ హ్యాండ్లర్ల ఆధ్వర్యంలో భారత్‌లో ఉగ్రవాద కార్యకలాపాలు సాగిస్తున్నట్లు తెలుస్తున్నది. ఉగ్రవాద గ్రూపులు భారత్‌లో సులభంగా దాడులు చేయడానికి వ్యవస్థీకృత నేర నెట్‌వర్క్‌లను ఉపయోగించుకుంటున్నాయి. ఉగ్ర ప్రచారానికి, సమాచార సరఫరాకు, నిధుల చేరవేతకు, దాడులకు మార్గనిర్దేశం చేయడానికి సోషల్ మీడియా మాధ్యమాలను, మెసేజింగ్ యాప్స్‌ను విరివిగా వాడుకుంటున్నాయి. డార్క్‌వెబ్, ఎన్‌క్రిప్షన్, క్రిప్టో వాలెట్ల వంటి నెట్‌వర్క్‌లు ఉగ్రవాదులు రహస్యంగా పని చేయడానికి వీలు కల్పిస్తున్నాయి.

ఈ పరిణామాలన్నీ ఉగ్రవాదుల పథకాలను, ఉగ్ర కుట్రలకు సంబంధించిన వ్యూహ రచనలను ఛేదించడం, వారికి నిధులు అందించే మార్గాలను కష్టతరం చేస్తున్నాయి. అంతేకాదు దేశంలో పేదరికం, నిరుద్యోగం వంటి సమస్యలను ఉగ్రసంస్థలు తమకు అనుకూలంగా మలుచుకొని యువతను తమవైపు ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ సమస్యలకు చెక్ పెట్టేందుకే కేంద్రం ‘ప్రహార్’ను తీసుకొస్తున్నది. ప్రహార్‌తో ఉగ్రవాద నిర్మూలన పూర్తిగా జరుగుతుందా అనేది పక్కనబెడితే ఉగ్రచర్యలకు అడ్డుకట్టలా నిలుస్తుందని మాత్రం చెప్పొచ్చు.