calender_icon.png 8 February, 2026 | 8:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇప్పటికింకా ఇండస్ట్రీకి దగ్గరగానే..

08-02-2026 12:57:57 AM

స్పెషల్ సాంగ్ అనగానే తన పేరే గుర్తొచ్చేంతగా వెండితెరను శాసించింది డ్యాన్సర్ ముమైత్ ఖాన్. ‘ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే..’ అంటూ ముమైత్‌ఖాన్ పంచిన అందచందాలు అప్పటి కుర్రకారు గుండెల్లో ఇప్పటికింకా పదిలమే! అంతలా ప్రేక్షకాదరణ పొంది, కొన్నేళ్లపాటు వరుస సినిమాల్లో ప్ర త్యేక గీతాలతో వెండితెరపై మెరిసిన ఈ ఐటమ్ గాళ్ అనూహ్యంగా చిత్రపరిశ్రమకు దూరమైంది.

తాజాగా ముమైత్ ఖాన్ పాల్గొన్న ఓ ఇంటర్వ్యూ సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. చాలా ఏళ్ల తర్వాత ఆమెను ఇంటర్వ్యూలో చూసిన అభిమానులు ఆమె పాటలను గుర్తు చేసుకుంటున్నారు. అయితే, ఈ ఇంటర్వ్యూలో తన గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకుందీ ముద్దుగుమ్మ. ఓ ప్రమాదం కారణంగా తాను ఏడు సంవత్సరాల పాటు మంచానికే పరిమితం కావాల్సి వచ్చిందని తెలిపారు.

ఇంటర్వ్యూలో ముమైత్ మాట్లాడుతూ.. “నా గురించి ప్రేక్షకులకు ప్రతిదీ రహస్యమే. నా సన్నిహితులకు మాత్రమే నా గురించి తెలుసు. నా చిన్నప్పుడు రోజుకు రెండు రూపాయలు ఆదా చేసేందుకు నేను కొన్ని కిలోమీటర్లు నడిచి బడికి వెళ్లేదాన్ని. అలా రోజూ రెండు రూపాయలు మిగిల్చి మా నాన్నకు ఇచ్చేదాన్ని. 13 ఏళ్ల వయసులోనే సినీ పరిశ్రమకు వచ్చా. ఆ తర్వాత నాకు జరిగిన ఓ ప్రమాదం కారణంగా డ్యాన్సులకు దూరంగా ఉన్నా. అంతేకానీ, ఇండస్ట్రీ పూర్తిగా వదిలివెళ్లలేదు. ప్రమాదం జరిగినప్పుడు మెదడులో నరాలకు దెబ్బ తగిలింది. కదలకుండా ఉంటే నయమవుతుందని, అందుకోసం కనీసం ఏడేళ్లపాటు బెడ్ రెస్ట్ తీసుకోవాల్సిందేనని వైద్యులు సూచించారు.

బరువు ఎత్తవద్దని చెప్పారు. అలా పూర్తిగా మంచానికే పరిమితం కావడం, మందులు వాడడం వల్ల లావయ్యా. అయితే, ఈ ప్రమాదం గురించి నాకెలాంటి బాధ లేదు. ఎందుకంటే, వరుస సినిమాలతో బిజీ అయిన నేను విరామం తీసుకోవడానికే దేవుడు అలా చేశాడని అనుకుంటా. నేను బెడ్ రెస్ట్‌కు పరిమితమైనప్పుడు మా అమ్మ నన్ను కంటికిరెప్పలాగా కాపాడింది. ఇప్పటికీ నాకేదైనా అవసరమైతే అమ్మ అనుమతి తీసుకున్న తర్వాతే కొనుక్కుంటా. ఒకవేళ నేను నటిని కాకపోయి ఉంటే.. ఒళ్లంతా టాటూలు వేయించుకుని గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకునేదాన్ని” అని చెప్పుకొచ్చింది.