గోపతండలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు
- అంబేద్కర్ చేసిన కృషి స్ఫూర్తిదాయకం
- సర్పంచ్ బిక్కు
మోతె,(విజయక్రాంతి): సమాజంలోని అట్టడుగు స్థాయి వారి సాధికారిత కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేసిన కృషి మనందరికీ నేటికీ స్ఫూర్తిదాయకమని గోపతండ గ్రామ సర్పంచ్ భూక్య బిక్కు అన్నారు. గోపతండ గ్రామపంచాయతీ కార్యాలయంలో భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న బాబా సాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని ఆ మహనీయుడు చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు.
అనంతరం సర్పంచ్ భూక్య బిక్కు మాట్లాడుతూ.. సమాజంలోని సామాజిక అసమానతలను తొలగించి, అణగారిన వర్గాలకు సమన్యాయం అందించాలనే లక్ష్యంతో డాక్టర్ అంబేద్కర్ భారత రాజ్యాంగంలో అనేక అంశాలకు చోటు కల్పించారని అన్నారు. ప్రజలంతా మొదట విద్యావంతులైతేనే ఉన్నతమైన సమాజం ఏర్పడుతుందని నమ్మి ఆ దిశగా కృషిచేసిన మహనీయుడు అంబేద్కర్ అని కొనియాడారు. స్వేచ్ఛ సమానత్వం సౌబ్రాతృత్వం అందరికీ దక్కేలా రాజ్యాంగ రూపకల్పన చేశారని తెలిపారు. ఆయన కల్పించిన హక్కులతోనే నేడు మనమంతా స్వేచ్ఛగా జీవిస్తున్నామని స్పష్టం చేశారు.
సమాజంలో ప్రతి ఒక్కరూ కుల మత అసమానతలు లేకుండా స్వేచ్ఛగా జీవించాలని అంబేద్కర్ కలలుగన్నారని నేడు ఆ కలలను నిజం చేసే దిశగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన కొనసాగిస్తున్నాడన్నారు. ఆ మహనీయుడు ఇచ్చిన స్ఫూర్తితో మనమంతా ముందుకు సాగాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మాలోతు ఈశ్వరి రవి, గ్రామ కార్యదర్శి ఎస్కే సొందు, మాజీ ఎంపిటిసి గుగులోతు శ్రీరాములు, అంగన్వాడీ టీచర్లు దారమళ్ళ మంగమ్మ, పెరుగు రమాదేవి, వార్డు మెంబర్ బాసు,గుగులోతు మంగ్య, గ్రామ యువకులు తదితరులు పాల్గొన్నారు.






