15 April, 2026 | 2:59 AM

ఆవిష్కరించిన మరుసటి రోజు అంబేద్కర్, బీజేఆర్ విగ్రహాల తొలిగింపు

15-04-2026 12:16 AM

హస్తినాపురంలో బీజేపీ నాయకుల ఆందోళన 

ఎల్బీనగర్, ఏప్రిల్ 14 : హస్తినాపురం డివిజన్ పరిధిలోని నందనవనం ప్రాంతం లో ఉన్న లక్కీ హోటల్ వద్ద ప్రతిష్టించిన అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాలను పలు వివాదాల నేపథ్యంలో ఎట్టకేలకు సోమవారం ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆవిష్కరించారు. అయితే, ఆవిష్కరించిన మరుసటి రోజు అనుమతులు లేవని పోలీస్ బందోబస్తు మధ్య విగ్రహాలను అక్కడి నుంచి తొలి గించారు.  విషయం తెలుసుకున్న బీజేపీ నాయకుడు గజ్జల రాజు గౌడ్ ఆధ్వర్యంలో నందనవనంలో అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించి, ఆందోళన చేపట్టారు.

తొలి గించిన అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాలను తక్షణమే ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు రాజేంద్రప్రసాద రావు, జిల్లా కార్యవర్గ సభ్యుడు గజ్జల రాజు గౌడ్, జనరల్ సెక్రెటరీ గౌని వెంకటేష్ గౌడ్, నాయకులు కంది శ్రీనివాస్  రెడ్డి, శేఖర్ గౌడ్, జీవన్ రెడ్డి, కిరణ్ రెడ్డి, చంద్రకాంత్, శ్రీకాంత్ గౌడ్, మల్లేశ్ యాదవ్, మునిల్ నాయక్, రాజ వర్ధన్ రెడ్డి, చిలుకూరి రాజేందర్, అంజి ముదిరాజ్, బాలరాజ్, రాజు మేస్త్రి, శివ, కాంతారెడ్డి పాల్గొన్నారు.

ఎమ్మెల్యే హెచ్చరించినా..విగ్రహాల అపహరణ 

లక్కీ హోటల్ వద్ద ప్రతిష్టించిన అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాలను బీఆర్‌ఎస్ డివిజన్ అధ్యక్షుడు ఆందోజు సత్యం చారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ... మహనీయుల విగ్రహాల ప్రతిష్టాపనలో రాజకీయ కక్షసాధింపు చర్యలకు పాల్పడడం సరికాదన్నారు. మూడు నెలల్లో  కొన్ని అడ్డంకులు వచ్చినా విగ్రహాలను ఆవిష్కరించినట్లు తెలిపారు. విగ్రహాల జోలికి ఎవరైనా వస్తే ఖబడ్దార్ అని హెచ్చరించారు. కాగా, ఎమ్మెల్యే హెచ్చరికలను బేఖాతరు చేస్తూ విగ్రహాలను తొలిగించడం చర్చనీయాంశమైంది.