28 February, 2026 | 6:01 PM

కడ్తాల్ ‘ప్రగతి’ పాఠశాలలో అద్భుతంగా విజ్ఞాన మేళా

28-02-2026 12:38 AM

ఆకట్టుకున్న విద్యార్థుల ప్రదర్శన

కడ్తాల్, ఫిబ్రవరి 27:(విజయక్రాంతి): నేటి చిన్నారుల సృజనాత్మక ఆలోచనలే రేపటి దేశ భవిష్యత్తుకు పునాదులని మాజీ సర్పంచ్ లక్ష్మీ నర్సింహ్మ రెడ్డి అన్నారు. కడ్తాల్లోని ప్రగతి ఉన్నత పాఠశాల విద్యార్థులు ఏర్పాటు చేసిన విజ్ఞాన మేళా 2026 శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమైంది.

స్థానిక నేతలతో కలిసి ఆయన ఈ ప్రదర్శనను సందర్శించి, విద్యార్థుల ప్రతిభను అభినందించారు. విద్యార్థులు తమ మేధస్సుకు పదును పెట్టి రూపొందించిన పలు సైన్స్ నమూనాలు సందర్శకులను మంత్రముగ్ధులను చేశాయి. సౌరశక్తి నీటిపారుదల యంత్రం.. వ్యవసాయ రంగంలో మార్పుకోసం విద్యార్థులు చూపిన చొరవ,ఆటోమేటిక్ ట్రాఫిక్ కంట్రోల్, పెరుగుతున్న రద్దీకి సాంకేతిక పరిష్కారం,స్మార్ట్ సిటీ & వర్షపు నీటి సంరక్షణ, పర్యావరణ హితమైన అభివృద్ధి నమూనాలు,ప్లాస్టిక్ రీసైక్లింగ్, కాలుష్య నివారణకు చూపిన వినూత్న మార్గాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని, సమాజానికి ఉపయోగపడే ఆవిష్కరణలు రూపొందించారు. విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంచుతున్న పాఠశాల యాజమాన్యం కృషిని పలువురు అభినందించారు. కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ సువర్ణ గోవర్ధన్ రెడ్డి, మాజీ ఉప సర్పంచ్ రామకృష్ణ, గంపా శ్రీనివాస్ గుప్తా, సిద్దిగారి వెంకటేష్, కంబాల అంజి, ముస్లి మహేష్, సురేష్, శ్రీను, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.