21 August, 2026 | 1:22 AM

వివాదంలో మిథున్ మన్హాస్

21-08-2026 12:22 AM

బీసీసీఐ అధ్యక్షుడిపై వయసు మోసం ఆరోపణలు

క్రికెట్ కెరీర్‌లో పుట్టిన తేదీ వేరువేరుగా చూపారని ఫిర్యాదు 

విచారణకు జమ్మూ రైల్వే కోర్టు ఆదేశం

జమ్మూ, ఆగస్టు 20: మాజీ క్రికెటర్, బీసీసీఐ అధ్యక్షుడు మిథున్ మన్హాస్ వివాదంలో చిక్కుకున్నారు. జూనియర్ స్థాయి క్రికెట్ సెలక్షన్‌లో ఎంపికయ్యేందుకు పుట్టిన తేదీ మార్చినట్లు ఇప్పుడు మిథున్‌పై ఆరోపణలు వచ్చాయి. జమ్మూకశ్మీర్ క్రికెట్ అసోసియేషన్ మాజీ జాయింట్ ఆనరరీ సెక్రటరీ సుదర్శన్ మెహతా దాఖలు చేసిన ఫిర్యాదుతో ఈ కేసు తెరపైకి వచ్చింది.

మిథున్ మన్హాస్ పుట్టిన తేదీకి సంబంధించిన రికార్డుల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ.. మోసం, చీటింగ్, ఫోర్జరీ వంటి నేరాలపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని ఆయన కోర్టును ఆశ్రయించారు. ఈ వ్యవహరంపై ప్రాథమిక విచారణ జరిపి.. సెప్టెంబరు 3వ తేదీ లోపు నివేదిక సమర్పించాలని జమ్మూలోని స్థానిక కోర్టు పోలీసులను ఆదేశించింది. ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకా రం జమ్మూలోని మహారాజా హరి సింగ్ అగ్రికల్చర్ కాలేజియేట్ స్కూల్లో మన్హాస్ పుట్టిన తేదీ 1977 డిసెంబర్ 9గా నమోదై ఉందని పేర్కొన్నారు.

మరోవైపు ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ అధికారిక వెబ్‌సైట్‌లో ఆయన పుట్టిన తేదీ 1979 అక్టోబర్ 12గా ఉన్నట్లు ఫిర్యాదుదారుడు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ రెండు తేదీల మధ్య దాదాపు రెండేళ్ల వ్యత్యాసం ఉండటమే ప్రస్తుతం వివాదానికి కారణమైంది. అయితే ఇవన్నీ ప్రస్తుతం ఫిర్యాదుదారు చేసిన ఆరోపణలు మాత్రమే. పోలీసుల విచారణ అనంతరం సమర్పించే నివేదిక ఆధారంగా తదుపరి చర్యలపై కోర్టు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మిథున్ మన్హాస్ గత ఏడాది సెప్టెంబర్‌లో బీసీసీఐ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. జమ్మూకశ్మీర్ నుంచి బీసీసీఐ అధ్యక్ష పదవిని చేపట్టిన తొలి వ్యక్తిగా నిలిచారు. మాజీ భారత ఫస్ట్‌క్లాస్ క్రికెటర్ అయిన మన్హాస్ తన క్రికెట్ కెరీర్‌లో జమ్మూకశ్మీర్‌తో పాటు ఢిల్లీ తరఫున కూడా ప్రాతినిధ్యం వహించారు.