31 March, 2026 | 3:31 AM

బాలికలందరికీ వ్యాక్సినేషన్ చేయించాలి

31-03-2026 12:09 AM

కలెక్టర్ మను చౌదరి

మేడ్చల్, మార్చి 30(విజయ క్రాంతి): మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, హాస్టల్స్, స్కూల్స్ లోని 14 నుంచి 15 సంవత్సరాల వయసు గల బాలికలకు అందరికి హెచ్ పి వి వ్యాక్సినేషన్ ను  అందించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ మను చౌదరి అన్నారు. సోమవారం కీసర మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో  భవిష్యత్తులో గర్బాశయ క్యాన్సర్ నివారణకై  బాలికలకు హెచ్ పీ వి వ్యాక్సినేషన్ అందించే కార్యక్రమాన్ని జిల్లా  కలెక్టర్  మను చౌదరి ప్రారంభించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వ్యాక్సిన్ ఎంత డోసు ఇస్తున్నారని  అడిగి తెలుసుకున్నారు. వ్యాక్సిన్ తీసుకున్న బాలికలకు కలెక్టర్  వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ అందజేసారు. జిల్లాలోని బిసి, ఎస్సీ, మైనారిటి రెసిడెన్షియల్, హాస్టల్స్, స్కూల్స్ లలోని బాలికలకు కూడా హెచ్ పి వి వ్యాక్సినేషన్ అందించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్య అధికారికి సూచించారు. 

దీనికి సంబంధించి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి సంబంధిత శాఖల సమన్వయంతో పిల్లలందరిని మొబిలైజ్ చేసుకొని వ్యాక్సిన్ అందించేలా చూడాలన్నారు. జిల్లా వ్యాప్తంగా  అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఈ వ్యాక్సినేషన్ పై అవగాహన కల్పిస్తూ, అందించే కార్యక్రమాన్నిచేపట్టాలన్నారు. ఇంకెక్కడైనా వేరే చోట్ల ఉంటూ పని చేస్తున్న వారిని,  ఇంకేదైనా ఇబ్బందుల్లో ఉన్న వారిని గుర్తించి వారందరినీ కూడా మొబిలైజ్ చేసి వారికి కూడా వ్యాక్సినేషన్ అందించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.

అంతే కాకుండా గ్రామాలలో కూడా తల్లిదండ్రులకు, బాలికలకు స్వచ్ఛందంగా వచ్చి వ్యాక్సిన్ తీసుకునేలా  అవగాహన కల్పించాలన్నారు.  అనంతరం పిహెచ్ సి సెంటర్ ను పరిశీలించి అవసరమైన మరమ్మత్తులకు మంజూరు చేయడం జరిగిందని అందులో ఏమేమి పనులు చేయిస్తారని మెడికల్ ఆఫీసర్ ను అడిగి తెలుసుకున్నారు. అదనంగా నిధులు అవసరమైతే ప్రతిపాదనలు పంపాలని సూచించారు.

మందుల గదిని పరిశీలించి ఎక్సైపైరీ డేట్  పరిశీలించి మందులు అందించాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో కీసర్ ఆర్డిఓ రాజేష్, జిల్లా డిఎంఅండ్ హెచ్‌ఓ ఉమాగౌరి, డిప్యూటి డిఎంహెచ్‌ఓ సత్యవతి, కౌషిక్  పిఓ,  పిహెచ్సి  మెడికల్  ఆఫీసర్ మంజుల, బాలికలు, తదితరులు పాల్గొన్నారు.