10 April, 2026 | 6:45 PM

గల్ఫ్ బాధితుల కోసం అడ్వైజరీ కమిటీ ఏర్పాటు

10-04-2026 04:51 PM

నిర్మల్,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో గల్ఫ్ ఎన్నారైల సంక్షేమం కోసం , వారి స్థితిగతుల అధ్యయనానికి ఎన్నారై అడ్వైజరి కమిటీ నియమించడం జరిగిందని ఎన్నారై నిర్మల్ జిల్లా బాధ్యులు స్వదేశీ పరికిపండ్ల తెలిపారు. కమిటీ వివరాలను వెల్లడించారు. ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు... గల్ఫ్ కార్మికుల సంక్షేమం, సమగ్ర ఎన్నారై పాలసీ పై అధ్యయనం చేయడానికి ఎన్నారై అడ్వయిజరీ కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జీవో జాబ్ చేసినట్టు జిల్లా అధ్యక్షులు స్వదేశీ పరికిపండ్ల తెలిపారు. రెండేళ్ల కాలపరిమితి గల ఈ కమిటీ, ఈ రోజుతో ఒక సంవత్సరం పూర్తి చేసుకున్నది.

కమిటీ చైర్మన్ గా ఇండియన్ ఫారిన్ సర్వీస్ రిటైర్డ్ అధికారి, అంబాసిడర్ డా. బి.ఎం. వినోద్ కుమార్, వైస్ చైర్మన్ గా గల్ఫ్ వలసల నిపుణులు మంద భీంరెడ్డి లను నియమించారు. జిఎడి ప్రోటోకాల్, ఎన్నారై విభాగానికి చెందిన జాయింట్ సెక్రెటరీ స్థాయి ఐఏఎస్ అధికారి కమిటీకి మెంబర్ సెక్రెటరీగా వ్యవహరిస్తారు. కమిటీలో గౌరవ సభ్యులుగా మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి, ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి, రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్, బాల్కొండ మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్ లను నియమించారు.

గల్ఫ్ వలసలపై క్షేత్ర స్థాయిలో అవగాహన కలిగిన ప్రవాసీ కార్మిక నాయకులు  సింగిరెడ్డి నరేష్ రెడ్డి, డా. లిజీ జోసెఫ్, చెన్నమనేని శ్రీనివాస రావు, కొట్టాల సత్యంనారా గౌడ్, గుగ్గిల్ల రవిగౌడ్, నంగి దేవేందర్ రెడ్డి, స్వదేశ్ పరికిపండ్ల లను కమిటీ సభ్యులుగా నియమించారు. ఈ కమిటీ గల్ఫ్ తదితర గమ్యస్థాన దేశాలలోని అల్పాదాయ తెలంగాణ వలస కార్మికులకు ఆయా దేశాలలో లభిస్తున్న వివిధ సంక్షేమ కార్యక్రమాలను ఈ కమిటీ పరిశీలించవలసి ఉన్నది.  దేశంలోని కేరళ, పంజాబ్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాల్లో గల్ఫ్ కార్మికులకు అందుబాటులో ఉన్న సంక్షేమ పథకాలను ఈ కమిటీ అధ్యయనం చేయాలి.

ప్రవాసీ కార్మికుల సమస్యలను అర్థం చేసుకోవడానికి, పరిష్కారాలను కనుగొనడానికి ఈ కమిటీ గల్ఫ్ దేశాలను కూడా సందర్శించాల్సిన అవసరం ఉన్నది.  ఈ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా... సమగ్ర ప్రవాస భారతీయుల విధానం (ఎన్నారై పాలసీ) రూపకల్పన తో పాటు, తెలంగాణ గల్ఫ్ అండ్ అదర్ ఓవర్సీస్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు (గల్ఫ్ తదితర దేశాల్లోని తెలంగాణ ప్రవాసీ కార్మికుల సంక్షేమ బోర్డు) ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుంది.