జిల్లాలో 5 ఎకరాల పంట నష్టం
నిర్మల్,(విజయక్రాంతి): జిల్లాలో ఇటీవల కురిసిన అకాల వర్షాలు, వడగండ్ల వానల వల్ల దెబ్బతిన్న పంటల నష్టాన్ని శాస్త్రీయంగా అంచనా వేయాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ వ్యవసాయ అధికారులను ఆదేశించారు. గత మూడు రోజుల్లో కురిసిన వడగళ్ల వాన బలమైన గాలుల వల్ల పంట నష్టం వివరాలు అంచనా వేయడం జరిగిందన్నారు. జిల్లాలో క్షేత్రస్థాయిలో జరిగిన ప్రాథమిక అంచనాల ప్రకారం, జిల్లా వ్యాప్తంగా సుమారు 5,000 ఎకరాల్లో వివిధ పంటలకు నష్టం వాటిల్లినట్లు గుర్తించారు.
ముఖ్యంగా మక్కజొన్న పంట తీవ్రంగా దెబ్బతిన్నట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతి పంట పొలాన్ని వ్యక్తిగతంగా సందర్శించి, జరిగిన నష్టంపై సమగ్ర నివేదికను యుద్ధ ప్రతిపాదికన సిద్ధం చేయాలని ఆమె సూచించారు. రైతులు అధైర్యపడవద్దని, ప్రభుత్వం ద్వారా తగిన పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు. నష్టపోయిన రైతుల వివరాలను త్వరితగతిన నమోదు చేసి, ప్రభుత్వానికి నివేదికలు సమర్పించాలని అధికారులను ఆదేశించారు.




