18 July, 2026 | 12:33 AM

19 ఏళ్లుగా న్యాయం కోసం పోరాటం

18-07-2026 12:00 AM

ఢిల్లీకి చేరిన 60 గజాల ఇళ్ల స్థలాల సమస్య

మొయినాబాద్, జూలై 17 (విజయక్రాంతి): మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని హిమాయత్నగర్ రెవెన్యూ పరిధి సర్వే నంబర్ 151లో 60 గజాల ఇళ్ల స్థలాల కోసం పోరాడుతున్న 290 మంది పేద కుటుంబాల సమస్య ఢిల్లీ ప్రధానమంత్రి కార్యాలయానికి చేరింది. తెలంగాణ టీడీపీ నాయకులు షాబాద్ మాణిక్యం గురువారం ఢిల్లీలోని పీఎంఓ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించి బాధితులకు న్యాయం చేయాలని కోరారు.

2007లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అర్హులైన పేదలకు 60 గజాల ఇళ్ల స్థలాల పట్టాలు మంజూరు చేసినప్పటికీ, ఇప్పటివరకు స్థలాలు అందుబాటులోకి రాకపోవడంతో బాధితులు గత 22 రోజులుగా రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నారు. ఈ సమస్యపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించి, పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని వినతిపత్రంలో విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంగా షాబాద్ మాణిక్యం మాట్లాడుతూ, 19 ఏళ్లుగా ఇళ్ల స్థలాల కోసం పేదలు ఎదురుచూస్తున్నారని, ప్రభుత్వాలు మారినా వారి సమస్య మాత్రం పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా బాధితులు నిరసన కొనసాగిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమన్నారు. హిమాయత్ నగర్ బాధితులకు వెంటనే ఇళ్ల స్థలాలు కేటాయించి న్యాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వా న్ని ఆయన డిమాండ్ చేశారు.