ప్రతి పేద కుటుంబానికి సొంతిల్లు
భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం
గృహ విప్లవం, రెవెన్యూ సంస్కరణలతో తెలంగాణలో నవశకానికి శ్రీకారం
మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
హైదరాబాద్, మే 7 (విజయక్రాంతి): ప్రతి పేద కుటుంబానికి సొంతిల్లు సమకూర్చడం, భూ యాజమానులకు తమ భూమిపై స్పష్టమైన హక్కులను కల్పించడమే లక్ష్యంగా ప్రజాప్రభుత్వం పనిచేస్తుందని రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.
పేదల జీవితాల్లో శాశ్వత మార్పు తీసుకురావాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం ముందుకెళ్లుందన్నారు. హౌసింగ్, రెవెన్యూ అంశాలపై జిల్లాల వారీగా ప్రజాప్రతినిధులతో జరుపుతున్న సమీక్షలో భాగంగా గురు వారం హౌసింగ్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయం లో ఉమ్మడి నల్లగొండ, మహబూబ్ నగర్ జిల్లాల ఇన్‌ఛార్జి మంత్రులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీ లు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, హౌసింగ్, రెవెన్యూ, అటవీ అధికారాలతో మంత్రి పొంగులేటి సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశాల్లో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, నల్లగొండ ఇన్‌ఛార్జి మంత్రి ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లణ్ కుమార్, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డ్డి, కోమటిరెడ్డి వెంకట్, వాకాటి శ్రీహరి, జూపల్లి కృష్ణారావు, ప్రణాళిక బోర్డు వైస్ చైర్మన్ జి. చిన్నారెడ్డి, ప్రభుత్వ సల హాదారులు జితేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. ఇందిరమ్మ గృహ పథకం కింద పేద కుటుంబాలకు వారి సొంత స్థలంలో ఇంటి నిర్మాణం కోసం రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 4 లక్షల ఇళ్లు మంజూరు చేసినట్లు చెప్పారు.
సమన్వయంతో పని చేయండి
సంక్షేమ పథకాల అమలులో స్థానిక ప్రజాప్రతినిధులతో సమన్వయంతో వ్యవహరించాలని, ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయాలని అధికారులకు మంత్రి సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఖాతాల్లో సకాలంలో బిల్లులు జమ అయ్యేలా చూడాలని కలెక్టర్లకు స్పష్టం చేశారు.
ఇళ్ల నిర్మాణంలో అక్ర మాలకు తావుండరాదని, అర్హులకే సంక్షేమ ఫలాలు అందేలా చూడాలని, ఎక్కడ పొరపాటు జరిగినా ఉపేక్షించేది లేదన్నారు. గతంలో ఇందిరమ్మ ఇళ్ల కోసం సేకరించి పూర్తి స్థాయిలో వినియోగించకుండా మిగిలి ఉన్న భూముల్లో అర్హులైన వారికి ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణపు పను లు ఏ స్థాయిలో ఉన్నా, ఈ నెల 20లోగా లబ్ధిదారుల ఎంపికను పూర్తి చేయాలని సూచించారు.
అదనపు తహసీల్దార్లను నియమిస్తాం
రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో రెవెన్యూ, రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు నూతన భవనాలను నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, వీటిని ప్రజలకు అందుబాటులో ఉండే ప్రదేశాల్లో చేపట్టేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. అలాగే లక్షకు పైగా జనాభా ఉన్న మండలాల్లో, అవసరానికి అనుగుణంగా అదనంగా మరో తహసీల్దార్‌ను నియమించ నున్నామని, ఇందుకు ప్రతిపాదనలను సిద్ధం చేయాలని కలెక్టర్లను మంత్రి ఆదేశించారు.
రెవెన్యూ, అటవీ తదితర శాఖల మధ్య ఉన్న భూ వివాదాల పరిష్కారం కోసం ఆయా విభాగాలు ఉమ్మడిగా సర్వే చేయాలన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రెవెన్యూ శాఖలో అనేక సంస్కరణలు తీసుకుని వచ్చి ఆర్డీఓలకు విస్తృతమైన అధికారాలు కల్పించామన్నారు.






