నేలతల్లికి ‘గ్లైసిల్’ ఉచ్చు!
గ్లైసిల్ పత్తి విత్తనాల పడగ!
సరిహద్దు జిల్లాల్లో యథేచ్ఛగా రవాణా ఏడారిగా మారనున్న పంట భూములు
బెజ్జూర్, (విజయక్రాంతి): గ్లైసిల్ పత్తి విత్తనాలను ప్రభుత్వం నిషేధించింది. అయితే ఏంటట.. అంటూ వ్యాపారులు హెచ్‌టీబీటీ అని పిలిచే ఈ పత్తి విత్తనాలను మార్కెట్‌లో గుట్టుచప్పుడు కాకుండా అమ్ముతున్నారు. అంతేకాదు ఈ సీజన్‌లో ఈ విత్తనాల వాడకం ౩౦ శాతం వరకు పెరిగింది! మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల సరిహద్దుల నుంచి రాష్ట్రంలోకి భారీగా గ్లైసిల్ పత్తి విత్తనాలు అక్రమంగా రవాణా అవుతున్నాయి.
గ్లైసిల్ విత్తనాలకు వాడే గ్లైఫోసేట్ రసాయనం కార ణంగా నేలలో ఉండే ‘నైట్రోజన్ ఫిక్సింగ్’ బ్యాక్టీరియా సుమారు 40 శాతం వరకు తగ్గిపోతున్నట్లు నిపుణులు చెబుతున్నా రు. దీనితో భూమి నిస్సారంగా మారుతున్నది. భవిష్యత్తులో పంటలు పండక భూములన్నీ ఎడారిగా మారే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక, మహారాష్ట్రలో గడ్డి మందుపై నిషేధం లేకపోవడంతో అక్కడి నుంచి కొంతమంది తెచ్చి ఇక్కడి రైతులకు అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు తెలిసింది.
నేలతల్లికి ‘గ్లైసిల్’ ఉచ్చు!
- 30 శాతం పెరిగిన నిషేధిత విత్తనాల విక్రయం
- సరిహద్దు జిల్లాల్లో యథేచ్ఛగా రవాణా
- పాతాళానికి పడిపోతున్న భూసారం
బెజ్జూర్, ఏప్రిల్ 14 (విజయక్రాంతి): రైతన్న నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని అక్ర మ విత్తన వ్యాపారులు మళ్లీ పడగ విప్పుతున్నారు. ప్రభుత్వం కఠినంగా నిషేధించిన హెచ్‌టీబీటీ లేదా ‘గ్లైసిల్’ పత్తి విత్తనాలు మార్కెట్‌లో గుట్టుచప్పుడు కాకుండా అమ్ముడవుతున్నాయి. గత ఏడాదితో పోలి స్తే ఈ సీజన్‌లో వీటి వాడకం దాదాపు 25 నుంచి 30 శాతం వరకు పెరిగినట్టు వ్యవసాయరంగ నిపుణులు అంచనా వేస్తున్నారు.
సరిహద్దులే అక్రమాలకు అడ్డా
నిషేధిత విత్తనాలు ప్రధానంగా పొరుగు రాష్ట్రాల నుంచి దిగుమతి అవుతున్నాయి. మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్ జిల్లాల మీదుగా భారీ గా గ్లైసిల్ విత్తనాలు రాష్ట్రంలోకి వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా, ఎన్టీఆర్, గుంటూ రు జిల్లాల పరిసర ప్రాంతాల నుంచి ఖమ్మం, సూర్యాపేట జిల్లాలకు ఈ విత్తనాల రవాణా యథేచ్ఛగా సాగుతున్నది. కర్ణాటక రాష్ట్రంలోని రాయచూరు ప్రాంతం నుంచి ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాల్లోకి కూడా అక్రమంగా విత్తనాలు చేరుతున్నాయి. అధికారుల దాడుల్లో కొంతమేర విత్తనా లు పట్టుబడుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో విక్రయాలు మాత్రం ఆగడం లేదని సమాచారం.
అన్నదాతపై అదనపు ఖర్చు
ప్రారంభంలో కలుపు నివారణ ఖర్చు త గ్గుతుందని రైతులు భావించినప్పటికీ, మూ డేండ్ల తర్వాత భూమి నిస్సారంగా మారడంతో ఖర్చు ఎకరాకు రూ. 10,000 నుంచి రూ.15,000 వరకు పెరుగుతున్నది.
గ్లైసిల్ వల్ల భూసారం నాశనం
గ్లైఫోసేట్ వంటి ఘాటైన రసాయనాల వల్ల నేలలోని మేలు చేసే సూక్ష్మజీవులు నశించి భూమి నిస్సారంగా మారుతుంది. భవిష్యత్తులో పంటలు పండని ఎడారిగా మారే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ పంటలపై స్ప్రే చేసే కలుపు సంహారక మందుల వల్ల గాలి కాలుష్యం పెరిగి, వాటిని పీల్చే రైతులు, కార్మికుల ఊపిరితిత్తులు దెబ్బతింటాయని చెబుతున్నారు. చర్మ వ్యాధులు, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల ప్రమాదం పొంచి ఉన్నద ని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. అనుమతి లేని విత్తనాలను అమ్మడం, వాడటం చట్టప్రకారం నేరం. పట్టుబడితే జరిమానాలతోపాటు జైలు శిక్ష కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది.
నేలతల్లిని కాపాడుకుందాం
ఇప్పటికైనా మన నేలను కాపాడుకోవడం ప్రభుత్వంతోపాటు మనందరి బాధ్య త. భూదేవిని రక్షించాలంటే అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని గ్లైసిల్ విత్తనాల మూలాలను అణచివేయాలి. అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలి. రైతులు కూడా తక్షణ లాభాల కంటే నేల ఆరోగ్యాన్ని ముఖ్యంగా భావించాలి. వ్యవసాయశాఖ సమన్వయంతో సరిహద్దుల వద్ద నిఘా పెంచి, గ్రామాల్లో గ్లైసిల్ వాడకం వల్ల కలిగే నష్టాలపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఉంది.
గణాంకాలు చెబుతున్న భయంకర నిజాలు
గ్లైసిల్ విత్తనాలకు వాడే గ్లైఫోసేట్ రసాయనం కారణంగా నేలలో ఉండే ‘నైట్రోజన్ ఫిక్సింగ్’ బ్యాక్టీరియా సుమారు 40 శాతం వరకు తగ్గిపోతున్నట్టు నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ప్రజారోగ్యానికి ముప్పు
ఈ విత్తనాలకు వాడే రసాయనాలు, పంటపై పిచికారీ చేసే మందుల వల్ల వ్యవసాయ కార్మికుల్లో శ్వాసకోశ, చర్మ సంబంధిత వ్యాధులు 20 శాతంపైగా ఎక్కువగా నమోదవుతున్నాయని ప్రాథమిక అధ్యయనాలు చెబుతున్నాయి.
నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తే కేసులే
ఎవరైనా గ్లైసిల్ పత్తి విత్తనాలు విక్రయిస్తే పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తాం. నిషేధిత గడ్డి మందులు లేదా గ్లైసిల్ విత్తనాల విక్రయం, సరఫరా గురించి సమాచారం అందించిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతాం. వారికి తగిన బహుమతి కూడా అందజేస్తాం.
ఎస్సై, సర్తాజ్ పాషా గ్లైసిల్ పత్తి విత్తనాలతో ప్రమాదం
గ్లైసిల్ పత్తి విత్తనాలు, గ్లైఫోసేట్ వంటి నిషేధిత గడ్డి మందులు వాడటం వల్ల భూసారం దెబ్బతింటుంది. అవి మనుషుల ఆరో గ్యానికి కూడా ప్రమాదకరం. రైతు లు తప్పనిసరిగా లైసెన్స్ కలిగిన దుకాణాల్లోనే నాణ్య మైన పత్తి విత్తనాలు కొనుగోలు చేయాలి. నిషేధిత విత్తనాలు వాడితే ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు కూడా కోల్పోయే ప్రమాదం ఉంది.
ఏవో నాగరాజు
అధికారుల ‘కంటితుడుపు’ దాడులు
మేము తనిఖీలు నిర్వహిస్తున్నాం అని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నప్పటికీ, అవి చిన్నపాటి వ్యాపారులకే పరిమితమవుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ దందా వెనుక ఉన్న అసలైన పెద్దలపై చర్యలు తీసుకోవడంలో అధికారులు వెనుకంజ వేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా వేల ఎకరాల్లో గ్లైసిల్ పత్తి సాగవుతున్నట్టు అంచనా ఉన్నా, చర్యలు మాత్రం నామమాత్రంగానే ఉన్నాయని రైతులు అంటున్నారు.
ఉదాహరణకు బెజ్జూర్ మండలంలోని సోమిని, ఇప్పలగూడ, తలాయి, సిద్ధాపూర్, బెజ్జూర్, కుకూడ తదితర గ్రామాల రైతులకు అధిక ధరలకు గ్లైసిల్ పత్తి విత్తనాలు అమ్ముతున్నట్టు సమాచారం. గతంలో పత్తి పంట సకాలంలో దిగుబడి ఇచ్చినప్పటికీ, ఈసారి పంట ఆలస్యంగా రావడానికి గ్లైసిల్ విత్తనాలే ప్రధాన కారణమని ఆరోపణలు వినవస్తున్నాయి.
నాణ్యమైన విత్తనాలు వేసుకున్న రైతులు సకాలంలో పత్తి పంటను కోయగా, గ్లైసిల్ విత్తనాలు వాడిన రైతుల పంట మాత్రమే ఆలస్యంగా చేతికి వచ్చిందని చెబుతున్నారు. దీంతోపాటు మహారాష్ట్రలో గడ్డి మందుపై నిషేధం లేకపోవడంతో అక్కడి నుంచి తెచ్చి ఇక్కడి రైతులకు అధిక ధరలకు అమ్ముతున్నట్టు తెలిసింది.






