13 June, 2026 | 2:57 AM

ప్రతి శుక్రవారం డ్రై డే కార్యక్రమాన్ని నిర్వహించాలి

13-06-2026 01:53 AM

కలెక్టర్ అనురాగ్ జయంతి

యాదగిరిగుట్ట, జూన్ 12: ప్రతి శుక్రవారం విధిగా డ్రైడే కార్యక్రమాన్ని నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. యాదగిరిగుట్ట మున్సిపాలిటీ గుండ్లపల్లి గ్రామంలోని 7వ వార్డులో నిర్వహించిన డ్రై డే ఫ్రై డే కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. దోమల ద్వారా వ్యాపించే వ్యాధులను నివారించేందుకు ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమన్నారు.

ఇళ్లలోని నీటి ట్యాంకులు, పాత డబ్బాలు, పాత్రలు వంటి వాటిలో నిల్వ ఉండే నీటిని పూర్తిగా తొలగించి శుభ్రపరచాలని సూచించారు. కూలర్లను తరచుగా శుభ్రం చేయడం, కొబ్బరి చెక్కలు, పాత టైర్లు వంటి వ్యర్థాలను తొలగించడం ద్వారా దోమల పెరుగుదలను అరికట్టవచ్చన్నారు. ప్రతి కాలనీలో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టడంతో పాటు దోమల ద్వారా వ్యాపించే వ్యాధులపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు.

కాలనీలలో ఉన్న ఓపెన్ డ్రైనేజీలలో ఆయిల్ బాల్స్ వేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గుండ్లపల్లి వాణి భరత్ గౌడ్, కౌన్సిలర్లు బబ్బూరి శ్రీధర్ గౌడ్, లావణ్య శ్రీధర్ గౌడ్, నాయకులు మాజీ ఎంపీపీ చీర శ్రీశైలం, ఎరుకల హేమేంధర్ గౌడ్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, మండల వైద్యాధికారి డాక్టర్ పావని, స్థానిక ప్రజలు,తదితరులు పాల్గొన్నారు.