5 April, 2026 | 5:28 AM

రెండు రోజుల్లో ప్రళయమే

05-04-2026 01:15 AM
  1. ఇరాన్‌కు మిగిలింది 48 గంటలే

ఇరాన్‌కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్ర హెచ్చరికలు

ఇరాన్‌లోని బుషెహర్ అణు విద్యుత్ కేంద్రంపై ఇజ్రాయెల్ క్షిపణి దాడి

అణుదాడులు గల్ఫ్‌ను నాశనం చేస్తాయ్ : ఇరాన్ మంత్రి అబ్బాస్ అరాగ్చి

ఇరాన్ సరిహద్దు షలాంచే మార్గం, సిమెంట్ ఫ్యాక్టరీ,  పెట్రోకెమికల్ జోన్, ఇస్ఫహాసన్‌పై ఐడీఎఫ్ క్షిపణులు దాడి

24 గంటల దాడుల్లో మొత్తం ముగ్గురు మృతి, ఐదుగురికి గాయాలు

ఇరాన్ విశ్వవిద్యాలయాల్లో ఆన్‌లైన్ తరగతలు

హోర్ముజ్‌లో ఇజ్రాయెల్ నౌకపై ఇరాన్ దాడి

టెహ్రాన్/బీరుట్/ అబుదాబీ, ఏప్రిల్ 4: ఇరాన్‌కు మిగిలింది ఇక రెండు రోజులేనని, ఆ తార్వత ఆ దేశంలో ప్రళ యం సృష్టిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్రంగా హెచ్చరించారు. అమెరికా విధించిన 10 గడువుకు 48 గంటలే ఉన్నాయని, ఆ లోపు ఐఆర్‌జీసీ ప్రభుత్వం మేలుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. మరోపక్క అమెరికా- ఇజ్రాయెల్-, ఇరాన్ యుద్ధం పశ్చిమాసియాలో రోజురోజుకూ విజృంభిస్తూ బీభత్సం సృష్టిస్తోంది.

36వ రోజైన శనివారం కూడా ఇటు గల్ఫ్, అటు ఇరాన్, లెబనాన్ ప్రాంతాల్లో భీకరంగా దాడులు జరిగాయి. ఇజ్రాయెల్ ఇరాక్- సరిహద్దులోని షలాంచే మార్గంపై క్షిపణి దాడి చేసింది. దీంతో ఆ మార్గాన్ని తాత్కాలికంగా మూసివేశారు. ఈ ఘటనలో ఒకరు మృతిచెందారు. మరో ఐదు గురికి గాయాలయ్యాయి. దక్షిణ ఇరాన్‌లోని సిమెంట్ ఫ్యాక్టరీపై మిస్సైల్స్ విరుకుపడ్డాయి. అలాగే ఇస్ఫహాన్‌పై ఇజ్రాయెల్ సైన్యం చేసిన దాడిలో రెడ్ క్రెసెంట్ కార్యకర్త మృతి చెందాడు.

అలాగే ఈ ప్రాంతంలోని పెట్రోకెమికల్ జోన్‌లో పేలుళ్లు సంభవించాయి. అమెరికా ఇరాన్ విశ్వవిద్యాలయాలను లక్ష్యంగా చేసుకోవడంతో ఆన్‌లైన్‌లో చదువులు చెప్పాలని ఇరాన్ ఆదేశించింది. ఉత్తర ఇజ్రాయెల్‌పై హిజ్బుల్లా మరిన్ని రాకెట్లు దాడిచేశాయి. ఇరాన్ లోని బుషెహర్ అణు విద్యుత్ కేంద్రంపై ఇజ్రాయెల్ క్షిప ణి దాడి చేసింది ఈ ఘటనలో క్షిపణి శకలాలు తగిలి ఒకరు మృతి చెందారు. ఓ భవనం ధ్వంసమైంది. హోర్ము జ్ జలసంధిలో ఇజ్రాయెల్ నౌకపై ఇరాన్ దాడి చేసింది. 

 మధ్య ఆసియా దేశాల్లో యుద్ధం భీకరంగా గర్జిస్తోంది. 56వ రోజు శనివారం కూడా డ్రోన్లు, క్షిపణులు ఆయా ప్రాంతాల్లో మార్మోగాయి. ప్రధానంగా ఇరాన్, లెబనాన్‌పై వివిధ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రా యెల్ బలగాలు బాంబుల వర్షం కురిపించాయి. దాడులకు ముందు దక్షిణ లెబనాన్‌కు ఇజ్రాయెల్  హెచ్చరికలు జారీ చేసింది. హిజ్బుల్లా లక్ష్యాలపై జరగబోయే దాడుల నేపథ్యంలో, టైర్ నివాసితులను తక్షణమే సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని ఐడీఎఫ్ సైన్యం కోరింది.

బుర్జ్ అల్-షమాలి శరణార్థి శిబిరం సమీప ప్రాం తాలతో సహా, జహ్రానీ నదికి ఉత్తరంగా పౌరులు తరలివెళ్లాలని అధికార ప్రతినిధి అవిచాయ్ అడ్రాయీ తెలిపారు. అలాగే ఇజ్రాయెల్ దాడుల్లో 1,300 మందికి పైగా మరణించారు. లెబనాన్ జనాభాలో దాదాపు ఐదో వంతు మంది నిరాశ్రయులయ్యారు. లెబనాన్ భూభాగంలో సుమారు 15% ప్రాంతాన్ని ఖాళీ చేయాలని ఇజ్రాయెల్ ఆదేశాలు జారీచేసింది.

మరోవైపు షలాంచే సరిహద్దు మార్గంపై జరిగిన ఘోరమైన దాడిలో ఒకరు మరణించారు. మరో ఐదుగురు గాయపడ్డారని ఇరాక్ సరిహద్దు పోర్టుల అథారిటీ చీఫ్ ఒమర్ అల్-వేలీ చెప్పినట్లు అసోసియేటెడ్ ప్రెస్ పేర్కొంది. దీంతో ఇరాక్- సరిహద్దు మార్గం మూసివేశారు. అధికారులు మరిన్ని వివరాలు వెల్లడించలేదు. అయితే ఈ తాత్కాలిక మూసివేత నేపథ్యంలో ఇరాక్ ప్రభుత్వం వ్యాపారులను, ప్రయాణికుల ను ప్రత్యామ్నాయ మార్గాల వైపు మళ్లించింది. అలాగే దక్షిణ ఇరాన్ సిమెంట్ ఫ్యాక్టరీపై దాడులు జరిగాయి. కానీ ప్రాణనష్టం వాటిల్లలేదు.

దక్షిణ ఇరాన్‌లోని బందర్ ఖమీర్‌లో ఉన్న ఒక సిమెంట్ ఫ్యాక్టరీని లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగాయని, అయితే ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని హోర్మోజ్‌గాన్‌కు చెందిన ఒక భద్రతా అధికారి చెప్పినట్లు ‘ది టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్’ తెలిపింది. అమెరికా- దాడి వల్ల ఫ్యాక్టరీ ఉత్పత్తి గొలుసుకు అంతరాయం కలగలేదని తస్నిమ్ వార్తా సంస్థ పేర్కొంది. ఇదిలా ఉంటే ఇరాన్‌లోని ఇస్ఫహాన్‌పై చేసిన దాడిలో రెడ్ క్రెసెంట్ కార్యకర్త మృతి చెందాడు.

ఇస్ఫహాన్‌లోని మొబారకేలో జరిగిన అమెరికా- వై మానిక దాడిలో రెడ్ క్రెసెంట్ కార్యకర్త మరణించినట్లు ఇరాన్ ఫార్స్ న్యూస్ ఏజెన్సీ చెప్పింది. కొనసాగుతున్న ఘర్షణల మధ్య సహాయక కార్యకర్తలలో మరణాల సంఖ్య పెరుగుతుండడం గమనార్హం. టెహ్రాన్‌పై ఇజ్రాయెల్ తాజా దాడులను పూర్తి చేసింది. ఇరాన్ సైనిక మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని కొనసాగుతున్న ఆపరేషన్‌లో భాగంగా, ఆ దేశ రాజధాని టెహ్రాన్‌పై తాజా దాడులను పూర్తి చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. దక్షిణ ఇరాన్‌లోని మహ్షహర్ పెట్రోకెమికల్ జోన్‌లో పేలుళ్లు సంభవించాయి.

పేలుళ్లకు గల కారణం గానీ వాటి తీవ్రతపై గానీ వివరాలను ఇంకా వెల్లడించలేదు.  కానీ అధికారులు పరిస్థితిని అంచనా వేస్తున్నారు. ఇరాన్ పెట్రోకెమికల్ పరిశ్రమలో కీలక కేంద్రమైన ఈ సదుపాయం, దాని వ్యూహాత్మక, ఆర్థిక ప్రాముఖ్యతపై దెబ్బ పడింది. మరోపక్క ఉత్తర ఇజ్రాయెల్‌పై హిజ్బుల్లా మరిన్ని రాకెట్లను ప్రయోగించింది. లెబనీస్ సాయుధ సంస్థ హిజ్బుల్లా, తమ యోధులు ఉత్తర ఇజ్రాయెల్‌లోని కిరియత్ ష్మోనాపై రాకెట్ల వర్షం కురిపించి, రెండు దాడులు చేసినట్లు అల్ జజీరా తెలిపింది. గాయపడిన వారిని తరలించడం కోసం ఇజ్రాయెల్ దళాలు ఏర్పాటు చేశాయని పేర్కొంది.

దీంతో మారూన్ అల్-రాస్‌లోని హెలికాప్టర్ ల్యాండింగ్ ప్యాడ్ చుట్టుపక్కల ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని మరో రాకెట్ దాడి జరిగినట్లు కూడా ఆ సంస్థ పేర్కొంది. అయితే తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు అన్ని విశ్వవిద్యాలయ కోర్సులను ఆన్‌లైన్‌కు మార్చాలని ఇరాన్ ఆదేశించింది. దేశవ్యాప్తంగా విశ్వవిద్యాలయ కోర్సులు తిరిగి ప్రారంభమవుతాయని, అయితే తరగతులు ఆన్‌లైన్‌లోనే జరుగుతాయని ఇరాన్ తస్నిమ్ వార్తా సంస్థ పేర్కొంది.

ఈ వర్చువల్ లెర్నింగ్ విధానం తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు అమలులో ఉంటాయని సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. మరోపక్క డ్రోన్ శకలాలతో దుబాయ్ భవనాలు ధ్వంసం అయ్యాయి. అలాగే ఒరాకిల్, 17 అమెరికా సంస్థలను ఇరాన్ హెచ్చరించింది. అడ్డగించిన డ్రోన్ల నుంచి వెలువడిన శకలాలు, అమెరికా టెక్ సంస్థ ఒరాకిల్‌కు చెందిన భవనంతో సహా రెండు భవనాలను ధ్వంసం చేయాలని దుబాయ్ అధికారులు పేర్కొన్నారు.

ఈ దాడుల్లో ఎవ్వరికీ ఎటువంటి గాయాలు కాలేదని అసోసియేటెడ్ ప్రెస్ తెలిపింది. ఇంకోపక్క టెహ్రాన్‌లోని కీలక మౌలిక సదుపాయాలపై దాడి చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. గత రోజు టెహ్రాన్‌లో తమ వైమానిక దళం జరిపిన దాడుల్లో విమానం విధ్వంసమైందని పేర్కొంది. బాలిస్టిక్ క్షిపణి నిల్వ కేంద్రాలతో పాటు, ఆయుధాల ఉత్పత్తి, పరిశోధన, అభివృద్ధి సౌకర్యాలను లక్ష్యంగా చేసుకున్నట్లు ఐడీఎఫ్ సైన్యం శనివారం వెల్లడించింది. 

బుషెహర్ అణు విద్యుత్ కేంద్రంపై ఇజ్రాయెల్ దాడి

ఇరాన్‌లోని బుషెహర్ అణు విద్యుత్ కేంద్రం లక్ష్యంగా శనివారం జరిగిన క్షిపణి దాడి అంతర్జాతీయంగా తీవ్ర సంచలనం రేకెత్తించింది. ఈ ఘటనపై అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (ఐఏఈఏ) కీలక ప్రకటన విడుదల చేస్తూ.. అణు కేంద్రం సమీపంలో క్షిపణి పడినప్పటికీ, ప్రస్తుతానికి రేడియేషన్ ముప్పు లేదని స్పష్టం చేసింది. మరోపక్క అణు దాడులు గల్ఫ్‌ను నాశనం చేస్తాయని, బుషెహర్‌పై మరిన్ని దాడులు జరిగితే గల్ఫ్ సహకార మండలి(జీసీసీ) రాజధానుల్లో జీవరాశి అంతం అవుతుందని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి తీవ్ర హెచ్చరికలు చేశారు.

అలాగే ఇలాంటి దాడులు అత్యంత ప్రమాదకరమని, వీటిని వెంటనే ఆపాలని ఐఏఈఏ డైరెక్టర్ జనరల్ రాఫెల్ మరియానో గ్రాస్సీ అన్నారు. ఇరాన్ అణు ఇంధన సంస్థ అందించిన సమాచారం ప్రకారం.. ఈ దాడిలో అణు విద్యుత్ కేంద్రం ఆవరణలోని ఒక భవనం తీవ్రంగా దెబ్బతిన్నది. క్షిపణి శకలాలు తగిలి ఈ కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న భద్రతా సిబ్బందిలో ఒకరు మరణించినట్లు ఐఏఈఏ ధృవీకరించింది.

కొన్ని వారాలుగా ఈ కేంద్రం పరిసరాల్లో ఈ దాడి నాలుగోది కావడం, ఇరాన్‌లో ప్రస్తు తం పనిచేస్తున్న ఒకేఒక విద్యుత్ ప్లాంట్ ఇదే కావడం గమనార్హం. ఈ దాడిపై ఐఏఈఏ డైరెక్టర్ జనరల్ రాఫెల్ మరియానో గ్రాస్సీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ‘అణు విద్యుత్ కేంద్రాలు యుద్ధ క్షేత్రాలు కాకూడదు. ఇలాంటి దాడులు నిలిపివేయాలని ఆయన పిలుపునిచ్చారు.

రెండు రోజుల్లో ప్రళయమే: ట్రంప్

ఇరాన్‌కు మిగిలింది ఇక రెండు రోజులేనని, సమ యం మించిపోతోందని, ఆ లోపు ఐఆర్‌జీసీ ప్రభు త్వం మేలుకోవాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్రంగా హెచ్చరించారు. ఇక ముందు ఇరాన్‌లో ప్రళయం వస్తోందని, ఆ దేశ స్థావరాలు బీభత్సంగా మారుతాయని ఇరాన్‌కు వార్నింగ్ ఇచ్చారు. తమతో ఒప్పందం చేసుకోవడానికి లేదా హోర్ముజ్ జలసంధిని తెరవడానికి ఇరాన్‌కు ఇచ్చిన పది రోజుల గడువు దగ్గర పడిందన్నారు. కావున ఇక మిగిలింది 48 గంటలేనని, ఆ తర్వాత భారీ విధ్వంసం జరుగుతుందని చెప్పారు. ‘అంతా భగవంతుడి దయ’ అంటూ తన ట్రూత్ సోషల్ మీడియాలో శనివారం పోస్టు చేశారు.

అణుదాడులు గల్ఫ్‌ను నాశనం చేస్తాయ్: అరాగ్చి 

అణు దాడులు గల్ఫ్ నగరాలను నాశనం చేయగలవని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ హెచ్చరించారు. బుషెహర్ అణు విద్యుత్ కేంద్రంపై మరిన్ని దాడులు జరిగితే, రేడియోధార్మికత విడుదలై గల్ఫ్ నగరాలకు వ్యాపిస్తాయని వార్నింగ్ ఇచ్చారు. పదేపదే జరుగుతున్న దాడులపై పాశ్చాత్య దేశాల మౌనాన్ని ఆయన ఈ సందర్భంగా విమర్శించారు. రష్యా మద్దతు ఉన్న ఈ కేంద్రం ఇరాన్‌కు సుమారు 1,000 మెగావాట్ల విద్యుత్‌ను సరఫరా చేస్తుందని ఆయన పేర్కొన్నారు. ఇజ్రాయెల్- ఇప్పటికి బుషెహర్ ప్లాంట్‌పై నాలుగు సార్లు బాంబులు వేశా యి.

రేడియోధార్మికత విడుదలైతే, అది గల్ఫ్ సహకార మండలి(జీసీసీ) రాజధానుల్లో జీవరాశిని అం తం చేస్తుంది, టెహ్రాన్‌లో కాదు అని ఆయన సోషల్‌మీడియా ఎక్స్‌లో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే హో ర్ముజ్ జలసంధిలో ఇజ్రాయెల్‌కు చెందిన నౌకపై ఇరాన్ శనివారం డ్రోన్ దాడి చేసింది. దీంతో అం దులో మంటలు ఎగిసిపడ్డాయి. ఈ మేరకు ఇరాన్ మీడియా పేర్కొంది. దీనిపై ఇజ్రాయెల్ నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.