నా పేరును సిఫార్సు చేయండి
డిసిసి అధ్యక్షుడికి జహీర్ అక్తర్ వినతి
మహబూబ్ నగర్,(విజయక్రాంతి): త్వరలో జరగనున్న హైదరాబాద్-రంగారెడ్డి మహబూబ్ నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో అభ్యర్థిత్వం కోసం తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ)కి నా పేరును సిఫార్సు చేయాలని కోరుతూ టిపిసిసి అధికార ప్రతినిధి జహీర్ అక్తర్ శనివారం జిల్లా కేంద్రంలో డిసిసి అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్ కు వినతి పత్రం అందజేశారు. భారత జాతీయ కాంగ్రెస్ సిద్ధాంతాలు, విలువలకు అచంచలమైన నిబద్ధతతో 26 సంవత్సరాల నుంచి పార్టీకి సేవలు అందిస్తున్నట్లు తెలిపారు.
విద్యార్థి దశ నుంచి కాంగ్రెస్ పార్టీలో పని చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం నేను టీపీసీసీ అధికార ప్రతినిధిగా పనిచేస్తూ, పార్టీ ఆశయాలను, విధానాలను, కార్యక్రమాలను ప్రజలకు, మీడియాకు చురుకుగా తెలియజేస్తున్నట్లు వినతిలో పేర్కొన్నారు.రాబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా నాకు అవకాశం కల్పిస్తే నా సుదీర్ఘ రాజకీయ అనుభవం, సంస్థాగత సామర్థ్యాలు, విద్యా రంగ నాయకత్వం, గ్రాడ్యుయేట్ వర్గంతో ఉన్న బలమైన సంబంధాలను సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చని గెలుపే ధ్యేయంగా ముందుకు సాగుతానని తెలిపారు.






