15 May, 2026 | 8:37 PM

గణపవరం శివారులో యువకుడి హత్య

15-05-2026 07:36 PM

మూడు రోజుల తర్వాత మృతదేహంగా గణేష్

కోదాడ,(విజయక్రాంతి): సూర్యాపేట జిల్లాలోని కోదాడ మండలం గణపవరం శివారులో శుక్రవారం  యువకుడి మృతదేహం లభ్యం కావడంతో స్థానికంగా కలకలం  సృష్టించింది. మృతుడిని బల్గూరి గణేష్‌(23) పోలీసులు గుర్తించారు. గణేష్ గత మూడు రోజులుగా కనిపించకుండా పోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపిన విషయం తెలిసిందే. కుటుంబ సభ్యుల సమాచారం మేరకు, గణేష్ బెంగుళూరులో హోటల్ మేనేజ్‌మెంట్ విద్యను అభ్యసిస్తున్నాడు. ఇటీవల స్వగ్రామానికి వచ్చిన ఆయన అనుమానాస్పద పరిస్థితుల్లో అదృశ్యమయ్యాడు.

ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతూ గాలింపు చర్యలు చేపట్టగా, శుక్రవారం గణపవరం గ్రామ శివారులోని  మామిడి తోటల్లో గణేష్ మృతదేహం కనిపించడం విషాదాన్ని మిగిల్చింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గణేష్ మృతితో కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు.