21 March, 2026 | 9:50 AM

భద్రకాళి మాతకు లక్ష లిల్లీ పూలతో అర్చన

21-03-2026 01:30 AM

వరంగల్, మార్చి 20 (విజయక్రాంతి): చరిత్ర ప్రసిద్ధిగాంచిన వరంగల్ మహానగరంలోని శ్రీ భద్రకాళీ దేవస్థానములో శ్రీ పరాభవ నామసంవత్సర యుగాది (ఉగాది) నుండి శ్రీ భద్రకాళీ వసంత నవరాత్ర మహోత్సవములు నిర్వహిస్తున్నారు. వసంత నవరాత్రమహోత్సవముల సందర్భంగా రెండవ రోజు శుక్రవారం ఉదయం సుప్రభాత సేవ, నిత్యాహ్నికం జరుపడిన పిమ్మట అమ్మవారికి లక్ష లిల్లీ పూలతో లక్ష పుష్పార్చన నిర్వహించారు.

భద్రకాళి శేషు ఆధ్వర్యంలో ముఖ్య అర్చకులు వెంకటనాగరాజ శర్మ, వేద విద్యార్థులు నిర్వహించారు. ఈ రోజు లక్ష పుష్పార్చనకు ఉభయదాతలుగా వరంగల్ ప్రముఖ వ్యాపారి సురినేని నవీన్ రావు, నీరజ దంపతులు వ్యవహరించారు. శుక్రవారం ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అమ్మవారి దర్శనమునకు పోటెత్తారు. ఈ వసంత నవరాత్రులలో అమ్మవారికి నిర్వహించు లక్ష పుష్పార్చన కార్యక్రమాన్ని భక్తులు దర్శించుకొని అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని ఈవో రామల సునీత కోరారు.