5 June, 2026 | 8:56 PM

మొక్కలు నాటి, భవిష్యత్తు తరాలను కాపాడుదాం

05-06-2026 07:56 PM

పర్యావరణ పరిరక్షణ - ప్రతి ఒక్కరి బాధ్యత, సర్పంచ్ పగడాల రమాదేవి

దమ్మపేట,(విజయక్రాంతి): ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా శుక్రవారం సర్పంచ్ పగడాల రమాదేవి రాంబాబు ఆధ్వర్యంలో దమ్మపేట గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో అంగన్వాడీ టీచర్లు, సిబ్బంది, వార్డు మెంబర్లతో మొక్కలు నాటి నీళ్లు పోశారు. అనంతరం సర్పంచ్ పగడాల రమాదేవి మాట్లాడుతూ మానవాళి బ్రతకాలి అంటే భూమి పై మొక్కలు ఉండటం కీలకం అని, అందరూ మొక్కలు నాటి వాటి పరిరక్షణ బాధ్యత తీసుకోవాలన్నారు.

మొక్కలను పెంచితే పెరిగి పెద్దవై ప్రస్తుతం మనకు, భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన గాలిని అందిస్తాయి అన్నారు. ముఖ్యంగా సహజ వనరులు గాలి, నీరు, నేల కలుషితం చేయకుండా బాధ్యతగా ఉండాల్సిన అవసరం మన అందరి పై ఉందన్నారు. కాలుష్య నియంత్రణకై ఇంధన వనరులు పొదుపుగా వినియోగించడం అవసరం అని మోటార్ సైకిల్ ని తగ్గించి నడవటం, సైకిల్ వాడటం అలవాటు చేసుకోవాలన్నారు. ప్లాస్టిక్ కవర్లకు బదులు జ్యూట్, క్లాత్ బ్యాగ్ లను వినియోగించాలన్నారు. పురుగుమందులు, రసాయన ఎరువులకు బదులుగా సహజ ఎరువులు వాడాలనీ, ఇవి నేల సారాన్ని పెంచి భూమిని కలుషితం కాకుండా చేస్తాయన్నారు. ఎలెక్ట్రిక్ వాహనాలు, సౌర విద్యుత్ వాడకం వైపు ప్రజలు మొగ్గు చూపాలన్నారు.