ఫైనల్ ఫైట్
నేడు టీ20 ప్రపంచకప్ ఫైనల్
టైటిల్ పోరుకు భారత్, కివీస్ సిద్ధం
మూడోసారి టైటిల్‌పై భారత్ కన్ను
తొలిసారి వరల్డ్ కప్ కోసం కివీస్ వేట
20 జట్లతో మొదలైన మెగాటోర్నీ క్లైమాక్స్‌కు వచ్చేసింది.. డిఫెండింగ్ చాంపియన్ భారత్ , అండర్ డాగ్స్ న్యూజిలాండ్ ఫైనల్లో తలపడబోతున్నాయి. వరుసగా రెండోసారి, మొత్తంగా మూడోసారి టీ20 వరల్డ్ కప్ గెలిచి చరిత్ర సృష్టించేందుకు టీమిండియా ఎదురుచూస్తుంటే... తొలిసారి తమ ప్రపంచకప్ కలను నెరవేర్చుకునేందుకు న్యూజిలాండ్ పట్టుదలగా ఉంది. ఇరు జట్లు బలాబలాల పరంగా సమఉజ్జీలుగా ఉన్న నేపథ్యంలో హోరాహోరీ పోరు ఖాయంగా కనిపిస్తోంది. మరి సొంతగడ్డపై భారత్ కదంతొ క్కుతుందా.. లేక అహ్మదాబాద్ స్టేడియంలో ఫ్యాన్స్‌ను సైలెంట్ చేస్తామన్న శాంట్నర్ దానిని నిజం చేస్తాడా...
అహ్మదాబాద్, మార్చి 7: నెలరోజులుగా క్రికెట్ అభిమానులను అలరిస్తున్న టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది. ఆదివారం జరిగే టైటిల్ పోరులో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్, న్యూజిలాండ్ తలపడబోతున్నాయి. అహ్మదాబాద్ నరేంద్రమోదీ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. భారీ అంచనాల మధ్య టోర్నీలో అడుగుపెట్టిన టీమిండియా దానికి తగ్గట్టే రాణిస్తూ ఫైనల్ చేరుకుంది. ఆరంభంలో అమెరికా మ్యాచ్‌లో తడబడినా తర్వాత పుంజుకుని వరుసగా విజయాలతో గ్రూప్ స్టేజ్‌ను అగ్రస్థానంతో ముగించింది. అయితే సూపర్ 8లో మాత్రం భారత్‌కు ఊహించని విధంగా చుక్కెదురైంది.
సౌతాఫ్రికా చేతిలో ఓడిపోయి అసలు సెమీస్‌కు చేరుతుందా అన్న అనుమానాలు కూడా తలెత్తాయి. తర్వాత పుంజుకుని వరుస విజయాలతో దర్జాగా సెమీస్ చేరడం, అక్కడ ఇంగ్లాండ్ ఓడించి ఇప్పుడు వరల్డ్ కప్‌కు అడుగుదూరంలో నిలిచింది. ఇక్కడి వరకూ అంతా బాగానే ఉందా ఉంటే వెంటనే అవునని చెప్పలేని పరిస్థితి. ఫైనల్‌కు ముందు భారత్‌కు కూడా కొన్ని సమస్యలున్నాయి. అభిషేక్ శర్మ ఫామ్.. ఇప్పటి వరకూ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన సూర్య.. బౌలింగ్ అసలు అనుకున్నస్థాయిలో లేకపోవడం.. ఇవే వెంటాడుతున్న బలహీనతలు.
ఆదివారం న్యూజిలాండ్‌తో ఫైనల్లో వీటిని అధిగమించగలిగితే మరోసారి భారత్ ప్రపంచకప్ అందుకోవడం ఖాయం. అదే సమయంలో మనకు అంతగా కలిసిరాని అహ్మదాబాద్ స్టేడియంలో అందులోనూ ఫైనల్లో ఉండే ఒత్తిడిని అధిగమించడంపైనే భారత్ గెలుపు అవకాశాలు ఆధారపడి ఉన్నాయి. ప్రస్తుతం భారత్ బ్యాటింగ్ లైనప్ చూస్తే అభిషేక్ శర్మ పేలవ ఫామ్‌తో సతమతమవుతున్నాడు. టైటిల్ పోరులో అభిషేక్ షేక్ ఆడిస్తే మాత్రం తిరుగుండదు. సంజూ శాంసన్ సూపర్ ఫామ్‌లో ఉండగా.. ఇషాన్ కిషన్ టచ్‌లోకి వచ్చాడు.
సూర్యకుమార్, హార్థిక్ పాండ్యా, తిలక్ వర్మ, దూబే కూడా కలిస్తే మళ్లీ భారీస్కోరు ఖాయం. అటు బౌలింగ్‌లో మాత్రం కాస్త ఆందోళన నెలకొన్న మాట వాస్తవమే. బుమ్రా తప్పిస్తే మిగిలినవారంతా నిరాశపరుస్తున్నారు. వికెట్లు తీయకపోగా భారీగా పరుగులు ఇచ్చేస్తుండడం కలవరపెడుతోంది. ఫీల్డింగ్ పరంగా సెమీఫైనల్‌తో మెరుగైన మార్కులే వచ్చాయి. కాగా తుది జట్టులో మార్పులు జరిగే అవకాశాలు లేనట్టే. అభిషేక్ శర్మపై మేనేజ్ మెంట్ నమ్మకముంచింది. అయితే వరుణ్ చక్రవర్తి స్థానంలో కుల్దీప్‌ను తీసుకునే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.
మరి విన్నింగ్ కాంబినేషన్‌ను మార్చే అలవాటు లేని గంభీర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి. మరోవైపు ఈ మెగాటోర్నీలో న్యూజిలాండ్ కూడా బాగానే ఆడుతోంది. సూపర్ 8లో ముందు వెనుకబడినా తర్వాత మెరుగైన రన్‌రేట్‌తో సెమీస్ చేరింది. సెమీఫైనల్లో సౌతాఫ్రికాపై కివీస్ దుమ్మురేపింది. ఫిన్ అలెన్ సెంచరీతో చెలరేగిపోతే.. సఫారీలు చిత్తుగా ఓడిపోయారు. ఫలితంగా ఫైనల్ మ్యాచ్‌కు ముందు పూర్తి ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్న కివీస్‌కు ఓపెనర్లు సిఫెర్ట్, ఫిన్ అలెన్‌తో పాటు గ్లెన్ ఫిలిప్స్, శాంట్నర్, రచిన్ రవీంద్ర కీలకంగా భావిస్తున్నారు.
గత రికార్డులు
టీ20ల్లో న్యూజిలాండ్‌పై భారత్‌దే పైచేయిగా ఉంది. ఇరు జట్లు 30 మ్యాచ్‌లలో తలపడితే భారత్ 18 సార్లు గెలిచింది. న్యూజిలాండ్ 11 మ్యాచ్‌లలో విజయం సాధిస్తే ఒక మ్యాచ్ ఫలితం తేలలేదు. అయితే టీ20 ప్రపంచకప్‌లో మాత్రం న్యూజిలాండ్‌తో తలపడిన 3 సార్లూ భారత్ ఓడిపోయింది
పిచ్ రిపోర్ట్
టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు మిక్స్‌డ్ పిచ్ రూపొందించినట్టు సమాచారం. ఎర్రమట్టి పిచ్‌ను సిద్ధం చేస్తుండగా బ్యాటర్లకు ఎక్కువ అనుకూలించినప్పటకీ బౌలర్లు కూడా అడ్వాంటేజ్ పొందుతారు. ముఖ్యంగా మ్యా చ్ సాగేకొద్దీ స్పిన్నర్లు కీలకపాత్ర పోషించే అవకాశముంది. ఫైనల్ కావడంతో ఇరు జట్లకు సమానంగా అనుకూలించేలా స్పోర్టి వ్ వికెట్ తయారు చేసినట్టు తెలుస్తోంది.
తుది జట్లు అంచనా
భారత్ : అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, హార్థిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి/కుల్దీప్ యాదవ్, అర్షదీప్ సింగ్, బుమ్రా
న్యూజిలాండ్ : టిమ్ సిఫెర్ట్, ఫిన్ అలెన్, రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్‌మన్, డారిల్ మిఛెల్, జిమ్మీ నీషమ్, మిఛెల్ శాంట్నర్ (కెప్టెన్), కోల్ మెకొన్హీ, మ్యాట్ హెన్రీ, ఫెర్గ్యుసన్




