పూర్తికాని కరకట్ట... పట్టణంలోకి ప్రవేశించిన గోదావరి వరద నీరు
ముగ్గురు మంత్రులు ఉన్నా.. పూర్తికాని కరకట్ట నిర్మాణం
వరద ముంపు పట్ల ముందస్తు చర్యలు శూన్యం
సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఏజే రమేష్
కరకట్ట స్లూ ఈజ్ లను పరిశీలించిన సిపిఎం బృందం
భద్రాచలం,(విజయక్రాంతి): భద్రాచలం పట్టణం సుభాష్ నగర్ కాలనీ శివారు ప్రాంతంలో చేపట్టిన కరకట్ట నిర్మాణం పనులు పూర్తి కాకపోవడంతో గోదావరి వరద నీరు పట్టణంలోకి ప్రవేశించిందని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఏజే రమేష్ ఆరోపించారు. శనివారం పట్టణంలోని ముప్పు ప్రాంతాలను సిపిఐఎం పార్టీ బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా ఏజే రమేష్ మాట్లాడుతూ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్న భద్రాచలం కు ముంపు బాధ తప్పడం లేదని, కరకట్ట నిర్మాణం పనులు ప్రారంభమై మూడేళ్లు అవుతున్న నేటికీ నిర్మాణం పనులు పూర్తి కాకపోవటం శోచనీయమని అన్నారు.
వరదలు వచ్చిన సమయంలో మంత్రులు హడావిడిగా పర్యటనలు చేయడం తప్ప కరకట్ట నిర్మాణం పూర్తి చేయడానికి కావలసిన చర్యలు చేపట్టకపోవడం దుర్మార్గమని అన్నారు. కరకట్ట స్లూయిజ్ లీకులు అవడం, విస్తా కాంప్లెక్స్ వద్ద ఉన్న స్లూయిజ్ దగ్గర ఏర్పాటు చేసిన మోటార్లు పనిచేయకపోవడంతో అన్నదాన సత్రం ముంపుకు గురైందని అన్నారు. ప్రభుత్వం, అధికారులు ముందస్తు చర్యలు చేపట్టడంలో విఫలం చెందారని విమర్శించారు.
దక్షిణ అయోధ్యగా పేరుపొందిన భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి నీ దర్శనానికి వచ్చే భక్తులకు బురదతో స్వాగతం పలికాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు. పట్టణంలోని అశోక్ నగర్ కొత్త కాలనీ వద్ద పూర్తిస్థాయిలో మోటర్లు ఏర్పాటు చేయకపోవడం దుర్మార్గమని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో పోలవరం ప్రాజెక్ట్ శరవేగంగా పూర్తి అవుతున్న నేపథ్యంలో కరకట్ట పునర్విమాన పనులపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలని కోరారు. కరకట్ట పునర్మాణ పనులు వేగవంతంగా ప్రారంభించని నేపథ్యంలో భవిష్యత్తులో పట్టణానికి పెను ప్రమాదం తప్పదని ఏజే రమేష్ ఆందోళన వ్యక్తం చేశారు.






