30 March, 2026 | 6:33 PM

శాతవాహనలో ఆహార విశ్లేషణపై రెండు రోజుల కార్యశాల

30-03-2026 04:53 PM

ముకరంపుర,(విజయక్రాంతి): శాతవాహన విశ్వవిద్యాలయం కరీంనగర్లో ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో ఆహార విశ్లేషణ పద్ధతులు అనే అంశంపై రెండు రోజుల కార్యశాల కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్ రమాకాంత్ అధ్యక్షతన జరగగా ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు తాము వినియోగించే ఆహారంలో సమతౌల్యత ఎలా ఉందో తెలుసుకోవాలని మంచి ఆహారపు అలవాట్లు పెంచుకోవాలని తెలియజేశారు.

ముఖ్యఅతిథిగా విచ్చేసిన పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ సురేష్ కుమార్ మాట్లాడుతూ ఆహార విశ్లేషణ పై జరిగె ఈ కార్యశాల ఆహార పదార్థాల వల్ల జరిగే రసాయన, భౌతిక,సూక్ష్మజీవుల లక్షణాలను అధ్యయనం చేసే ప్రక్రియ అని దీనితో నాణ్యమైన ఆహారాన్ని గుర్తించడం సులభం అవుతుందని పోషక పదార్థాలు ఉన్న ఆహారాన్ని తీసుకోవడం వల్ల జరిగే ఉపయోగాలను గుర్తించడమే ఈ ఆహార విశ్లేషణ ప్రధాన లక్ష్యమని రెండు రోజుల కార్యశాల వల్ల విద్యార్థులు వివిధ ఆహార పదార్థాల యొక్క ఉపయోగాలను అనర్ధాలను గుర్తించుకోవాలని తెలియజేశారు.

ఫుడ్ సైన్స్ విభాగాధిపతి, కార్యశాల కన్వీనర్ డాక్టర్ జోసఫ్ రాజు మాట్లాడుతూ ఆహారాన్ని నిలువ చేసే పద్ధతులపై,  ప్యాకేజింగ్ ప్రమాణాలపై అత్యంత మెలకువతో ఉండాలని దీని వలన ఆహార భద్రత ఏర్పడుతుందని వినియోగదారులు సురక్షితమైన ఆహారంతో ఆరోగ్యమైన జీవితాన్ని గడపవచ్చు అని తెలియజేశారు. ఈ రెండు రోజుల కార్యశాలలో నగరంలోని ఎస్.ఆర్.ఆర్ కళాశాల విద్యార్థులు జగిత్యాల లోని గురుకుల డిగ్రీ కళాశాల విద్యార్థులతో పాటు ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ విద్యార్థులు పాల్గొనగా అధ్యాపకులు డాక్టర్ హరిత, సాయిప్రియ పాల్గొన్నారు.