calender_icon.png 16 February, 2026 | 5:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెద్దల సభకు వెళ్లేది ఎవరు?

16-02-2026 01:16:21 AM

  1. బీసీలా.. ఓసీలా? 

ఏప్రిల్ 2న ముగియనున్న ఇద్దరు ఎంపీల పదవీకాలం

కాంగ్రెస్ నుంచి అభిషేక్ సింఘ్వీ, బీఆర్‌ఎస్ నుంచి కేఆర్ సురేష్‌రెడ్డి 

వచ్చే నెలలో విడుదల కానున్న నోటిఫికేషన్ 

ఈ రెండు సీట్లు కాంగ్రెస్ ఖాతాలోనే.. 

సింఘ్వీకి మరోసారి రెన్యువల్ చేయనున్న అధిష్ఠానం 

ఒక టికెట్ కోసం అరడజనుకుపైగా నేతల పోటీ 

ఢిల్లీలో పైరవీలు చేసుకుంటున్న ఆశావహులు 

హైదరాబాద్, ఫిబ్రవరి 15 (విజయక్రాంతి) : తెలంగాణ నుంచి రాజ్యసభలో ఏడుగురు సభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వారిలో కాంగ్రెస్ పార్టీ నుంచి ముగ్గురు అభిషేక్ సింఘ్వీ, రేణుకాచౌదరి, అనిల్‌కుమార్‌యాదవ్, బీఆర్‌ఎస్ నుంచి పార్థసారథిరెడ్డి, దామోదర్‌రావు, వద్ది రాజ్ రవిచంద్ర, కేఆర్ సురేష్‌రెడ్డి ఉన్నారు.

వీరిలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అభిషేక్ సింఘ్వీ, బీఆర్‌ఎస్‌కు చెందిన కేఆర్ సు రేష్‌రెడ్డిల పదవీ కాలం ఏప్రిల్ రెండో తేదీన ముగుస్తుంది. ఖాళీ అయ్యే ఈ రెండు రాజ్యసభ స్థానాలకు మార్చి నెలలోనే నోటిఫికేషన్ విడుదల కానుంది. అ సెంబ్లీలో ఇప్పుడున్న ఎమ్మెల్యే సంఖ్యాబలాన్ని బట్టి ఆ రెండు సీట్లు కాంగ్రెస్ పార్టీకే దక్కే అవకాశం ఉంది. 

అధిష్ఠానం అభిషేక్ సింఘ్వీ వైపే..

కాంగ్రెస్ పార్టీ మాత్రం అధిష్ఠానం కోటాలో ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు, పార్టీ సీనియర్ నేత అభిషేక్ సింఘ్వీకి మళ్లీ రెన్యువల్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎందుకంటే  సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదిగా ఉన్న సింఘ్వీ కాంగ్రెస్ పార్టీతో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన పలు కేసులను సుప్రీంకోర్టులో వాదిస్తున్నారు. అందుకు పార్టీకి అందిస్తున్న సేవల దృష్ట్యా సింఘ్వీని మరోసారి రాజ్యసభకు నామినెట్  చేసే అవకాశం కనిపిస్తోంది.

ఇక మిగిలిన ఒక  సీటు ద్వారా పెద్దల సభకు వెళ్లేందుకు అరడజనుకుపైగా తెలంగాణ కాంగ్రెస్ నేతలు  పోటీ పడుతున్నారు. అందుకు ఢిల్లీ స్థాయిలో కొందరు సీనియర్లు పైరవీలు మొదలు పెట్టారు. రాష్ట్ర స్థాయిలోనూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్‌తో పాటు ఇతర పెద్దలను కలిసి తమ అభ్యర్థిత్వాలను పరిశీలించాలని కోరుతున్నారు. 

ఒక్క సీటు.. ఏడుగురు ఆశావహులు 

పెద్దల సభకు వెళ్లేందుకు పీసీసీ మాజీ అధ్యక్షుడు వి.హనుమంతరావు, రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్ , ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు  హర్కర వేణుగోపాల్, షబ్బీర్‌అలీ, మాజీ మంత్రి చిన్నారెడ్డి తదితరులు రాజ్యసభ టికెట్ ఆశిస్తున్నారు. 

సామాజికవర్గాలపై చర్చ

రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల వాదం బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో రాజ్యసభకు బీసీలను పంపిస్తారా? లేదంటే ఓసీ సామాజిక వర్గానికి చెందిన వారిని ఎంపిక చేస్తారా? అనేది కాంగ్రెస్‌లో చర్చ నడుస్తోంది. రాజ్యసభ టికెట్ కోసం పోటీ పడుతున్న వారిలో హనుమంతరావు తప్ప మిగతా వారందరూ ప్రస్తుతం ప్రభుత్వ పదవుల్లోనే ఉన్నారు. ఇక మధుయాష్కీ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్బీనగర్ నుంచి పోటీ చేసి ఓటమి చెందారు.

పార్టీ నియామమళి మేరకు ఎమ్మెల్యే లేదా ఎంపీగా పోటీ చేసిన వారికి నామినేటెడ్ పదవుల్లో అవకాశం ఇవ్వరాదని నిర్ణయించారు. గత లోక్‌సభ ఎన్నికల్లో ఖమ్మం టికెట్‌ను వీహెచ్ ఆశించి భంగపడ్డారు. అయినా పార్టీ కార్యక్రమాల్లో వీహెచ్ చురుగ్గా పాల్గొంటున్నారు. ఇక వ్యవసాయ కమిషన్ చైర్మన్  కోదండరెడ్డి కూడా గతంలో రెండుసార్లు ఎమ్మెల్యేగా, ఆగ్రోస్, హుడా చైర్మన్‌గా  పనిచేశారు.

ఆ తర్వాత నుంచి కూడా పార్టీకి లాయల్‌గానే ఉండటంతో వ్యవసాయ కమిషన్ చైర్మన్‌గా అవకాశం కల్పించారు. ఇక గత ఎంపీ ఎన్నికల్లో  ఎస్సీలకు రిజర్వుడుగా ఉన్న మూడు (పెద్దపల్లి, నాగర్‌కర్నూల్, వరంగల్)  సీట్లలో  మాదిగలకు ఒక టికెట్  కూడా ఇవ్వలేదు. ఇప్పుడు రాజ్యసభ టికెట్ ఇచ్చి న్యాయం చేయాలని కాంగ్రెస్ పార్టీలోని మాదిగలు కోరుతున్నారు.  

తెరపైకి జస్టిస్ సుదర్శన్‌రెడ్డి పేరు

రాష్ట్రం నుంచి ఖాళీ అయ్యే రెండు రాజ్యసభ స్థానాలకు గాను ఒకటి పార్టీ సీనియర్ నేత సింఘ్వీని ఎంపిక చేసే అవకాశం ఉండగా, మ రొక స్థానానికి కొత్త పేరు వినిపిస్తోంది. విశ్రాంత జడ్జి సుదర్శన్‌రెడ్డిని కాంగ్రెస్ నుంచి రాజ్యసభకు పంపిస్తారనే ప్రచారం జరుగుతోంది. జస్టిస్ సుదర్శన్‌రెడ్డి ఇటీవలనే ఇండియా కూట మి నుంచి ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు. త్వరలో ఖాళీ అయ్యే రాజ్యసభ నుంచి సుదర్శన్‌రెడ్డికి అవకాశమిస్తారని రచ్చసాగుతోంది. సీఎం రేవంత్‌రెడ్డి కూడా సుదర్శన్‌రెడ్డి పేరును ఢిల్లీ పెద్దల దృష్టికి తీసుకెళ్లినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

అయితే సుదర్శన్‌రెడ్డి పేరు విషయంలో కాంగ్రెస్‌లో భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో ఒక వైపు బీసీ వాదం బలంగా వినిపిస్తుండగా, సుదర్శన్‌రెడ్డిని పేరు తెరపైకి తీసుకురావడం సరికాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పార్టీ కి కోసం కష్టపడిన వారిని ఎంపిక చేస్తే బాగుంటుందని, పార్టీకి సంబంధం లేనివారిని ఎంపిక చేస్తే భవిష్యత్‌లో ఇబ్బంది పడాల్సి వస్తుందని చెబుతున్నారు.