16-02-2026 01:17:19 AM
ఆయుధం వీడి జనజీవనంలో కలవండి
రెండేళ్లలో 588 మంది మావోయిస్టుల లొంగుబాటు
పునరావాస ప్యాకేజీతో గౌరవప్రదమైన జీవితం కల్పిస్తాం
డీజీపీ శివధర్‌రెడ్డి
హైదరాబాద్ సిటీ బ్యూరో, ఫిబ్రవరి 15 (విజయక్రాంతి): అజ్ఞాతంలో ఉంటూ ఉద్యమ బాటలో సాగుతున్న మావోయిస్టులు ఆయుధాలు వీడి, జనజీవన స్రవంతి లోకి రావాలని తెలంగాణ డీజీపీ శివధర్‌రెడ్డి పిలుపునిచ్చారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ర్టం నుంచి ఇంకా అజ్ఞాతంలో ఉన్న 15 మంది మావోయిస్టు క్యాడర్తో పాటు, ఇతర అగ్రనేతలు కూడా వెంటనే లొంగిపోవాలని విజ్ఞప్తి చేశారు. వారికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం తక్షణ సహాయం, ఆర్థిక ప్రయోజనాలు అందుతాయని హామీ ఇచ్చారు. తమ గ్రామాలు లేదా పట్టణాల్లో స్వేచ్ఛగా, ఆత్మగౌరవంతో జీవించేలా ప్రభుత్వం అండగా ఉంటుందని, వారి పునరేకీకరణకు పూర్తి సహకారం అందిస్తుందని స్పష్టం చేశారు.
మారుతున్న కాలం శాంతియుత, నిర్మాణాత్మక పరిష్కారాలను కోరుకుంటోందని, తెలంగాణ అభివద్ధికి, ప్రగతికి మావోయిస్టులు కూడా సానుకూలంగా సహక రించాలని డీజీపీ ఆకాంక్షించారు. సీఎం రేవంత్‌రెడ్డి చేసిన విజ్ఞప్తిని పునరుద్ఘాటిస్తూ.. అడవి బాట పట్టిన మావోయిస్టు అగ్రనేతలు, క్యాడర్ అంతా తిరిగి వచ్చి తమ కుటుంబాలతో ప్రశాంతమైన, సురక్షితమైన, గౌరవప్రదమైన జీవితాన్ని గడపాలని కోరుతూ ఆదివారం ప్రకటనను విడుదల చేశారు.
మారుతున్న కాలానికి అనుగుణంగా వాస్తవ పరిస్థితులను గ్రహించి, కుటుంబాల చెంతకు చేరాలని సూచించారు. గత రెండేళ్లలో తెలంగాణలో మావోయిస్టుల లొంగుబాటు ప్రక్రియ అత్యంత విజయవంతమైందని డీజీపీ తెలిపారు. వివిధ స్థాయిలకు చెందిన 588 మంది మావోయిస్టు నాయకులు, కార్యకర్తలు జనజీవన స్రవంతిలో కలిశారని వెల్లడించారు. వీరందరూ తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తున్న లొంగుబాటు, పునరావాస విధానం కింద ప్రయోజనాలను పొందారని, ప్రస్తుతం తమ స్వగ్రామాల్లో కుటుంబాలతో కలిసి సురక్షితంగా, సంతోషంగా జీవిస్తున్నారని పేర్కొన్నారు.
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పునరావాస విధానంపై మావోయిస్టులకు పూర్తి నమ్మకం కుదిరిందని, దీనికి నిదర్శనమే ఇతర రాష్ట్రాలకు చెందిన అజ్ఞాత మావోయిస్టులు కూడా తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోవడమని డీజీపీ వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల విశ్వసనీయత, కరుణ, సమర్థత వల్లే ఇది సాధ్యమైందన్నారు. ఈ సానుకూల ఫలితాలను దష్టిలో ఉంచుకుని మిగిలిన వారు కూడా భయం లేకుండా ముందుకు రావాలని కోరారు.