ఆర్‌ఎంపీ & పీఎంపీ వైద్యుల సమస్యల పరిష్కారమే లక్ష్యం
మంథని డివిజన్ అధ్యక్షుడు, నూతన కరీంనగర్ జోనల్ ఉపాధ్యక్షుడు డాక్టర్ కె.వి. చారి
ముత్తారం, జులై 15(విజయ క్రాంతి): ఆర్‌ఎంపీ & పీఎంపీ వైద్యుల సంక్షేమం, వారి వృత్తిపరమైన సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తానని మంథని డివిజన్ అధ్యక్షుడు, కరీంనగర్ జోనల్ ఉపాధ్యక్షుడు డాక్టర్ కె.వి. చారి తెలిపారు. ఆర్‌ఎంపీ, పీఎంపీ వైద్యులు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు ప్రాథమిక వైద్య సేవలు అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. వారి హక్కుల పరిరక్షణ, సంక్షేమం, శిక్షణా కార్యక్రమాలు, ప్రభుత్వ గుర్తింపు తదితర అంశాలపై సంఘం తరఫున ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని చెప్పారు. సంఘాన్ని మరింత బలోపేతం చేస్తూ సభ్యుల ఐక్యతతో ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. గ్రామీణ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే తమ ప్రధాన లక్ష్యమని డాక్టర్ చారి స్పష్టం చేశారు.






