16 August, 2026 | 4:34 AM

అన్ లిఫ్టింగ్ బిడ్డర్లపై కొరడా

16-08-2026 12:53 AM
  1. రూ.65.90 కోట్ల డిపాజిట్ల జప్తుకు నిర్ణయం
  2. మిగిలిన ధాన్యం విక్రయ బాధ్యతలు క్యాబినెట్ సబ్ కమిటీకి

హైదరాబాద్, ఆగస్టు 15 (విజయక్రాంతి) : వేలంలో దక్కించుకున్న ధాన్యాన్ని నిర్ణీత గడువులోపు తరలించకుండా నష్టం కలిగించిన బిడ్డర్లపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 2022 యాసంగి సీజన్‌లో అన్‌లిఫ్ట్ చేసిన ధాన్యానికి సంబంధించి ఎన్‌ఏసీఓఆఫ్, కేంద్రీయ భండార్ బిడ్డర్ల సెక్యూరిటీ డిపాజిట్ల నుంచి రూ.65.90 కోట్ల జప్తు చేయాలని నిర్ణయించింది. ఈ మొత్తాన్ని ప్రోరాట ప్రాతిపదికన స్వాధీనం చేసుకునేందుకు ప్రభుత్వం అంగీకరించింది.

ఈ మేరకు వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, పౌరసరఫరాల శాఖ జీఓఎంఎస్ నంబర్ 15 జారీ చేసింది. సెక్యూరిటీ డిపాజిట్లను జప్తు చేయడంతో పాటు మిగిలిన ధాన్యాన్ని ఎలా విక్రయించాలి, దాని ఖర్చు రికవరీ బాధ్యతలను కేబినెట్ సబ్ కమిటీకి అప్పగించింది. టెండర్‌లో ఆమోదించిన ధరకు లేదా అంతకంటే ఎక్కువకు రికవరీ చేసే అవకాశాలను పరిశీలించాలని ప్రభుత్వం ఆదేశించింది. చట్టపరమైన అంశాలను పరిశీలించి తుది నిర్ణయం తీసు కోవాలని సూచించింది. ఈ వ్యవహారంపై ఏడాది క్రితమే హెచ్చరికలు వచ్చినప్పటికీ.. తాజాగా సెక్యూరిటీ డిపాజిట్లను జప్తు చేయాలని ఉత్తర్వులు జారీ చేయడంతో మరోసారి తెరపైకి వచ్చింది.