3 July, 2026 | 2:17 AM

నీటి మాఫియా రాజ్యం..?

03-07-2026 12:00 AM
  1. ప్రజల దాహాన్ని సొమ్ము చేసుకుంటున్న ప్రైవేట్ ట్యాంకర్ల యజమానులు 
  2. చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్న అధికారులు
  3. మండిపడుతున్న బోడుప్పల్ ప్రజలు

మేడిపల్లి జూలై 2 (విజయక్రాంతి) : మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ బోడుప్పల్ సర్కిల్ పరిధిలో  తాగునీటి సమస్య రోజురోజుకూ తీవ్రమవుతోంది. వారానికి కేవలం ఒక్కసారి మాత్రమే నీటి సరఫరా జరుగుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

తాగునీటితో పాటు నిత్యావసర అవసరాలకు కూడా నీరు సరిపోక కుటుంబాలు అవస్థలు పడుతున్నాయి. నీటి కోసం ప్రజలు ప్రైవేట్ ట్యాంకర్లపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడిందని, దీంతో అదనపు ఆర్థిక భారం పడుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేసవి కాలం ముగిసినా పరిస్థితిలో ఎలాంటి మార్పు రాకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు నీటి సమస్యను వెంటనే పరిష్కరించి ప్రజలకు తాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

సొమ్ము చేసుకుంటున్న ప్రైవేట్ ట్యాంకర్ల యజమానులు!

ప్రజలు నీటి సమస్యతో ఇబ్బందులకు గురవుతున్నారని ఆసరాగా తీసుకొని కొందరు ప్రైవేట్ ట్యాంకర్ ల యజమానులు సొమ్ము చేసుకుంటూ, ఇష్టానుసారంగా అధిక ధరలు వసూలు చేస్తున్నారని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేట్ ట్యాంకర్లు సరఫరా చేస్తున్న నీరు ఎక్కడి నుంచి వస్తోంది, దానికి అనుమతులు ఉన్నాయా అనే అంశాలపై సంబంధిత అధికారులు దృష్టి సారించడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కొందరు ప్రైవేట్ భూముల్లో బోర్ల నుంచి నీటిని తీసి ట్యాంకర్ల ద్వారా అపార్ట్మెంట్లు, కాలనీలకు అధిక ధరలకు విక్రయిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ అక్రమ దందాపై జలమండలి అధికారులు కఠిన చర్యలు తీసుకోవడం లేదని, ఫిర్యాదులు వచ్చినా పట్టించుకోవడం లేదని స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రజల తాగునీటి అవసరాన్ని అడ్డం పెట్టుకుని జరుగుతున్న ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ చేపట్టి, నిబంధనలకు విరుద్ధంగా నీటిని విక్రయిస్తున్న ప్రైవేట్ ట్యాంకర్ నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.