37 వేల మంది పింఛన్‌దారులు ఎక్కడ?
- ముఖ గుర్తింపు సర్వేకు దూరం
- అవన్నీ బోగస్ పెన్షన్‌లేనా..?
- 920 మంది చనిపోయినట్లు గుర్తింపు
- మరణించిన వారి పెన్షన్ తీసుకుంటున్న కుటుంబ సభ్యులు
- జిల్లాలో బ్యాంకు ద్వారా తీసుకుంటున్న వారు 1,02,240 మంది
మేడ్చల్, జూలై 20 (విజయక్రాంతి): జిల్లాలో చేయూత పథకం ద్వారా అందిస్తున్న పింఛన్లలో అక్రమాలు బయటపడుతున్నాయి. బోగస్ పింఛన్లు, మరణించిన వారి పింఛన్ బ్యాంకు నుంచి డ్రా చేస్తున్నట్లు వెల్లడవుతోంది. ఇవన్నీ ముఖ గుర్తింపు సర్వేలో బహిర్గతమవుతున్నాయి. బోగస్ లబ్ధిదారులను ఏరివేసి అర్హులైన వారు, జీవించి ఉన్నవారికి పింఛన్ ఇవ్వాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ముఖ గుర్తింపు సర్వేకు శ్రీకారం చుట్టింది. పోస్ట్ ఆఫీస్ ద్వారా పెన్షన్ తీసుకుంటున్న వారు వేలిముద్ర వేసి పింఛన్ తీసుకుంటున్నారు.
బ్యాంకు ద్వారా తీసుకుంటున్న వారు జీవించి ఉన్నారో లేదో తెలియదు గాని, వారి ఖాతాలో ప్రతినెల డబ్బులు జమ అవుతున్నాయి. జిల్లాలో చేయూత పథకం కింద వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, దివ్యాంగులు మొత్తం లక్ష39 వేల మంది పెన్షన్ తీసుకుంటున్నారు. ఇందులో 102240 మంది బ్యాంకు ద్వారా తీసుకుంటున్నారు. లబ్ధిదారుల ముఖ గుర్తింపు సర్వే (లైవ్ అతంటికేషన్) కు జిల్లాలో 37 వేల మంది దూరంగా ఉన్నారు.
వీరు ఎక్కడున్నారో కూడా ఆచూకీ తెలియడం లేదు. వీరిలో ఎంతమంది జీవించి ఉన్నారు, ఎంతమంది ఎక్కడెక్కడ ఉన్నారో తెలియడం లేదు. పింఛన్ ఆగిపోతుందని అధికారులు ప్రచారం చేస్తున్నప్పటికీ వీరు స్పందించడం లేదు. అసలైన లబ్ధిదారులు వెంటనే గాబరాబడి లైవ్ అతంటికేషన్ చేయించుకున్నారు. ఈ 37 వేల మంది రాకపోవడం అనుమానాలకు తావిస్తోంది. బోగస్ పెన్షన్లు అయినందునే రావడంలేదని తెలుస్తోంది.
మొదట జూన్ నెల రెండో వారం వరకు లైవ్ అతంటికేషన్ చేయించుకోవాలని గడువు విధించారు. అర్హులకు నష్టం జరగకుండా గడువు పొడిగిస్తున్నారు. అయినప్పటికీ స్పందించడం లేదు. జిల్లాలో అత్యధికంగా కూకట్పల్లి ప్రాంతంలో పదివేల మంది, మల్కాజిగిరిలో 5700, కుత్బుల్లాపూర్ లో 3975, ఉప్పల్లో 2074, కాప్రా లో నాలుగు వేలు, వివిధ ప్రాంతాల్లో మరో 10 వేల వరకు లైవ్ అతంటికేషన్ చేయించుకోవలసి ఉంది.
జిల్లాలో చనిపోయిన వారు 920 మంది..
జిల్లాలో 920 మంది పెన్షన్ దారులు చనిపోయారు. మీరు ఎప్పుడు చనిపోయారు తెలియదు. కానీ వీరి పేరు మీద బ్యాంకులో ప్రతినెల డబ్బులు జమ అవుతున్నాయి. మరణ ధ్రువ పత్రం పొందే సమయంలో ఈ విషయం బహిర్గతమైతే జాబితా నుంచి పేరు తొలగిస్తున్నారు. లేకుంటే జాబితాలో పేరు అలాగే ఉంటుంది. వీరి పేరు మీద జమ అయిన డబ్బులను కుటుంబీకులు ఏటీఎం కార్డు ద్వారా డ్రా చేసుకుంటున్నారు. జిల్లాలో ప్రతినెల సుమారు 20 లక్షల రూపాయలు డ్రా అయ్యాయి.
ఇతర రాష్ట్రాల వారికీ పెన్షన్..!
జిల్లాలో ఇతర రాష్ట్రాల వారికి పెన్షన్ అందుతున్నట్లు తెలుస్తోంది. ఉత్తరాది రాష్ట్రాల వారితో పాటు ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ కు చెందినవారు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ కు చెందినవారు ఆ రాష్ట్రం తో పాటు తెలంగాణ రాష్ట్రానికి చెందిన సంక్షేమ పథకాల ఫలాలు పొందుతున్నారు. అప్పట్లో గల్లీ లీడర్లు డబ్బులు తీసుకుంటూ అర్హులకు, అనర్హులకు అందరికీ పెన్షన్ మంజూరు చేయించారు. వయస్సు లేకున్నప్పటికీ ఎక్కువగా రాయించి వృద్ధాప్య పింఛన్ మంజూరు చేయించారు. 37 వేల పెన్షన్ దారుల్లో ఇతర రాష్ట్రాల వారు, బోగస్ వారే ఎక్కువగా ఉన్నారు. అందుకే ప్రస్తుతం భయపడి రావడంలేదని తెలుస్తోంది.
ముఖ గుర్తింపు సర్వే చేయించుకోవాలి
జిల్లాలో బ్యాంకుల ద్వారా పెన్షన్ పొందుతున్న వారు వెంటనే ముఖ గుర్తింపు సర్వే చేయించుకోవాలి. జిల్లాలో ఇంకా 37 వేల మంది చేయించుకోవలసి ఉంది. ముఖ గుర్తింపు సర్వే చేయించుకోని వారి పెన్షన్ ఆగిపోతుంది. ఈ విషయాన్ని గమనించాలి.
సాంబశివరావు, డీఆర్‌డీఓ






