23 June, 2026 | 3:54 AM

హెల్త్‌కార్డులు ఎక్కడ?

23-06-2026 01:37 AM

ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల  ఎదురుచూపులు

  1. డబ్బుల్లేక సర్జరీలు వాయిదా.. 
  2. క్యాష్‌లెస్ ట్రీట్‌మెంట్ కోసం నిరీక్షణ 
  3. వేతనాల నుంచి డబ్బులు కోత పెట్టి.. 
  4. వైద్య సేవలు ఇవ్వకపోవడంపై అసంతృప్తి

హైదరాబాద్, జూన్ 22 (విజయక్రాంతి): రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు గోస పడుతున్నారు. వైద్యమో రామచంద్ర అంటూ మొరపెట్టుకుంటున్నారు. ప్రభుత్వం ఇస్తానన్న హెల్త్ కార్డుల కోసం ఆశగా వారంతా ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం హామీ ఇచ్చిన క్యాష్‌లెస్ హెల్త్ కార్డులు ఇప్పటికీ చేతికి అందకపోవడంతో రాష్ట్రంలో వందలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు సర్జరీలను వాయిదా వేసుకుంటున్నారు. అత్యవసర వైద్యం కోసం డబ్బులు లేక నరకయాతన అనుభవిస్తున్నారు. రూ.లక్షల్లో వైద్యానికి, సర్జరీలకు డబ్బులు చెల్లించే పరిస్థితిలేకపోవడంతో పలు రకాల సర్జరీలతోపాటు చికిత్స వాయిదావేసుకుంటున్నారు. 

ప్రస్తుతం ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు గతంలో ఇచ్చిన ఈహెచ్‌ఎస్ కార్డులు ఉన్నాయి. అవి అన్ని ఆస్పత్రుల్లో సరిగా పనిచేయడంలేదు. ఒకవేళ పనిచేసినా వాటిపై వైద్యం, సర్జరీలు చేసేందుకు ప్రైవేట్ ఆస్పత్రులు విముఖత వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో.. సంవత్సరాల తరబడి ఆ బిల్లుల కోసం వేచిచూడటం వారికి ఆర్థిక భారంగా మారుతోంది.

అందుకే ఆస్పత్రులు ఈ కార్డులపై వైద్యం అందించేందుకు వెనుకడుగు వేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో తమకు అన్ని ఆస్పత్రుల్లో పనిచేసే విధంగా క్యాష్‌లెస్ కొత్త హెల్త్ కార్డులు జారీచేయాలని ఉద్యోగుల నుంచి వచ్చిన డిమాండ్ మేరకు ప్రభుత్వం నూతన హెల్త్ స్కీంను అమలుచేస్తోంది.

ఇచ్చేదెప్పుడు?...

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు కార్పొరేట్ ఆస్పత్రుల్లో నగదు రహిత వైద్యం అందించేందుకు ప్రభుత్వం క్యాష్‌లెస్ ఎంప్లాయీస్ న్యూ హెల్త్ స్కీమ్ (ఈహెచ్‌ఎస్) ప్రకటించింది. ఈ పథకం కింద అర్హులందరికీ డిజిటల్ హెల్త్ కార్డులు ఇస్తామని హామీ కూడా ఇచ్చింది. ఈనేపథ్యంలోనే లబ్ధిదారుల ఖచ్చితమైన వివరాలు, సమాచారం కోసం ఆర్థిక శాఖ అన్ని ప్రభుత్వ శాఖలకు అత్యవసర ఆదేశాలు జారీచేస్తూ గత మే 31వ తేదీలోపు ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యుల వివరాలన్నింటినీ ఆన్‌లైన్ పోర్టల్లో అప్‌లోడ్ చేయాలని ఆదేశించింది.

ఈ డేటా ఆధారంగానే అత్యాధునిక డిజిటల్ హెల్త్ కార్డులను పంపిణీ చేస్తామని ప్రభుత్వం చెప్పింది. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగానే వివరాలను అప్‌లోడ్ చేశారు. దీనికితోడు క్యాష్‌లెస్ చికిత్స కోసం ఉద్యోగులు, పెన్షనర్ల బేసిక్ పే నుంచి 1.5 శాతం డబ్బులను కట్ చేస్తుంది. జూన్ నెలలో ఇప్పటికే కట్ చేయగా, జూలై నెల కూడా వస్తోంది.

ఈ నెలలోనూ వేతనాల నుంచి ప్రభుత్వం 1.5 శాతం నిధులను కట్ చేయనుంది. ఇదిలా ఉంటే ప్రభుత్వం ఇటీవల ఈహెచ్‌ఎస్ ట్రస్టు బోర్డును ఏర్పాటు చేసింది. ఈ బోర్డు ఇంతవరకు సమావేశం కాలేదు. సమావేశమై గైడ్‌లైన్స్ రూపొందించాల్సి ఉంది. అప్పటివరకు కార్డులపై స్పష్టత వచ్చే అవకాశం లేదు.

సర్జరీలు వాయిదా...

ప్రభుత్వం హెల్త్ కార్డులు జారీ చేయకపోవడంతో సర్జరీలను ఉద్యోగులు, పెన్షనర్లు వాయిదా వేసుకుంటున్నారు. గుండె జబ్బు లు, కిడ్నీ సమస్యలు, కీళ్ల మార్పిడి, కంటి, జీర్ణకోశ, హెర్నియా వంటి సర్జరీలను వాయిదా వేసుకుంటున్నారు. ప్రైవేటులో లక్షల్లో ఖర్చవుతుండటంతో తమ దగ్గర డబ్బు లేక ఆగిపోతు న్నారు. అత్యవసరం కాని సర్జరీలను కార్డు వచ్చాక చేసుకుందామని నిరీక్షిస్తున్నారు.

తమకు కార్డులు ఎప్పుడు ఇస్తారని ఉద్యోగ సంఘాల నాయకులకు, పెన్షనర్ల సంఘాల నాయకులకు ఫోన్ చేసి ఆరా తీస్తున్నారు. అత్యవసరమైన సర్జరీలను చేసుకోండని, అత్యవసరం లేకుంటే కొన్ని రోజులు వాయిదా వేసుకోవాలని వారికి నేతలు సూచిస్తున్నారు. పెన్షనర్లకు నెలవారీగా వచ్చే పెన్షనే తక్కువ.

దీనికి తోడూ రూ.లక్షల్లో సర్జరీకి డబ్బులు భరించలేక అనారోగ్యంతోనే కాలం వెళ్లదీస్తున్నారు. కార్డులు వచ్చే వరకు అయినా పాత ఈహెచ్‌ఎస్ కార్డులు చూపిస్తే చికిత్స అందించేలా ఆస్పత్రులకు ఆదేశాలు ఇవ్వాలని ఉద్యో గులు, పెన్షనర్లు విజ్ఞప్తి చేస్తున్నారు. లేదంటే అత్యవసర కేసుల్లో ప్రాణాలు పోయే ప్రమా దం ఉందని వారు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

ఒక్కో కాలుకు రూ.2 లక్షలు 

నా భార్యకు రెండు కాళ్లకు కీళ్ల మార్పిడి చికిత్స చేయించాలి. ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లడంతో ఒక్కో కాలుకు రూ.2 లక్షలు అడిగారు. మొత్తంగా రూ. 4 లక్షలు ఎక్కడి నుంచి తేవాలి. డబ్బు లు చెల్లించి సర్జరీ చేసుకుంటే బిల్లులు ఇస్తామని, రీయింబర్స్‌మెంట్ పెట్టుకోవాలని చెప్తున్నారు. ఒకవేళ ప్రభుత్వానికి బిల్లులు పెట్టుకున్నా రూ.4 లక్షలకు గా నూ రూ.2.5 లక్షలే వచ్చే అవకాశం ఉం టుంది. మిగిలిన రూ.1.50 లక్షన్నర రావు. డబ్బులు ఎక్కడి నుంచి తేవాలి.

 ఓ రిటైర్డ్ ప్రధానోపాధ్యాయుడు

స్టంట్ వేయించుకోవాలి 

ఓ ఉద్యోగి నాకు ఫోన్ చేసి తనకు హార్ట్‌లో స్టంట్ వేయాలని.. ప్రభుత్వ హెల్త్ కార్డులను ప్రభుత్వం ఎప్పుడు ఇస్తుందని ఆవేదన వ్యక్తం చేశాడు. చికిత్సకు సుమారు రూ.5 లక్షల వరకు అవు తుంది. ఎక్కడి నుంచి తేవాలని ఆవేదన వ్యక్తం చేశాడు. అత్యవసరమైతే వెంటనే సర్జరీ చేయించుకోవాలని సూచించాను. ఇలా ఉద్యోగులు, పెన్షనర్ల నుంచి మా కు ఫోన్లు వస్తున్నాయి. ఓ పెన్షనర్ ఫోన్ చేసి మోకాలు చిప్ప మార్పిడి చేయించుకోవాలని, కార్డులు ఎప్పుడు ఇస్తారు అని అడగడంతో అత్యవసరం లేకుంటే సర్జరీని కొన్ని రోజులు వాయిదా వేసుకోవాలని చెప్పాను.

 ఓ ఉద్యోగ సంఘం నేత