23 June, 2026 | 2:46 AM

నేషనల్ ఎస్టీ కమిషన్ సభ్యుడు హుస్సేన్ నాయక్‌ను కలిసిన ఐటీడీఏ పీవో

23-06-2026 01:35 AM

ఉట్నూర్, జూన్ 22 (విజయక్రాంతి): నేషనల్ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ నాయక్ ను ఉట్నూర్ సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) ప్రాజెక్టు అధికారి మంద మకరంద్ సోమవారం హైదరాబాద్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ భేటీలో గిరిజనుల సంక్షేమం, అభివృద్ధి, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, విద్య, ఆరోగ్యం, ఉపాధి అవకాశాల విస్తరణ వంటి అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం. గిరిజన ప్రాంతాల్లో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల పురోగతిని ప్రాజెక్టు అధికారి మంద మకరంద్ వివరించారు.

అదేవిధంగా గిరిజన సమాజం ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలు, కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో అమలు చేయాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై కూడా అభిప్రాయాలను పరస్పరం పంచుకున్నారు. ఈ సందర్భంగా నేషనల్ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్ మాట్లాడుతూ గిరిజనుల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. గిరిజనుల హక్కుల పరిరక్షణతో పాటు వారి సామాజిక, ఆర్థిక అభ్యున్నతికి అవసరమైన చర్యలను మరింత సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు.