మేడికొండ రోడ్డు బ్రిడ్జికి మోక్షం ఎప్పుడు?
అయిజ జూన్ 11 : తెలంగాణ ఆంధ్ర రెండు రాష్ట్రాలకు (ఏమ్మిగనూరు కర్నూల్ జిల్లా )అనుసంధానమైన మేడికొండ రోడ్డు బ్రిడ్జి దాదాపు సంవత్సరం క్రితం కొట్టుకుపోయి ప్రజల రాకపోకలకు ఇబ్బందులు కలిగిస్తున్న నాయకులు గానీ అధికారులు గానీ కనీసం దాని వైపు కన్నెత్తి చూసిన పాపాన పోలేదని, వర్షాకాలం వచ్చిందంటే చాలు వాగులు పొంగి రెండు రాష్ట్రాల రాకపోకలు నిలిచిపోతాయని ప్రజలు వాపోతున్నారు .
వచ్చేది వర్షాకాలం కావున తాత్కాలీకంగా వేసిన మట్టి రోడ్డు కొట్టుకుపోయి సుమారు 6 లేదా 7 గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోతాయి.విద్యార్థులు, వాహనదారులు, రెండు రాష్ట్రలకు సంబంధించి వ్యాపార లావాదేవీలు కూడా నిలిచిపోయే ఆస్కారమున్నాదని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. భారీ వర్షాలకు వాగుల ఉదృతితో దాటలేక ప్రజలు గ్రామాలకే పరిమితం అవుతున్నారని ప్రాణాపాయంతో ప్రమాదాలు ముంచుకొస్తే వాగులు దాటలేక ప్రాణాల మీదకు వచ్చిన సంఘటనలు కోకోల్లోలని గ్రామాల ప్రజలు ఆవేదన చెందుతున్నారు.
రోడ్డు దుస్థితి ఇలా..
ఇక రోడ్డు దుస్థితి చెప్పలేని పరిస్థితి. ఎందరో ఎమ్మెల్యేలు మారిన, అధికారులు మారిన రోడ్డు దుస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అనే పరిస్థితిలో ఉన్నది.ఎన్నికల సమయంలో హంగామా చేస్తారు.నాయకుల అవసరాలకు వచ్చి ఫోటోలకు పోజులిస్తారు. తూతూ మంత్రంగా రోడ్డు పనులు ప్రారంభిస్తారు. అడ్రస్ లేకుండా వెళ్లిపోతారని ఆయా గ్రామ ప్రజల్లో చర్చ కొనసాగుతుంది.ఆగిపోయిన బ్రిడ్జిల వల్ల, అసంపూర్ణ రోడ్డువల్ల గ్రామాలనుండి ప్రజల సత్సంబంధాలు తెగిపోతున్నాయంటే పాలకుల అసమర్ధతకు నిలువుటద్దమని గ్రామాల ప్రజలు బహిరంగoగానే అనుకుంటున్నారు.
మాయ మాటలు చెప్పి మోసం చేయడం అలవాటుగా మారింది
గత 10 సంవత్సరాలుగా ఎందరో పాలకులు, అధికారులు మారిన ఫలితం శూన్యమని, ఎన్నికల ముందు ఓట్ల కోసం వస్తారు మాయమాటలు చెబుతారు. ఎన్నికలు ముగిసిన తర్వాత ఇటువైపు కన్నెత్తి కూడా చూడరని ఎన్నోసార్లు ఎమ్మెల్యేలకు జిల్లా స్థాయి అధికారులకు విన్నవించిన మాగోడు పట్టించుకునే నాయకుడు గాని అధికారి గాని లేరు . . పనిచేస్తున్న వాటికీ బిల్లుల రాకపోవడం వల్ల పనులు ఆగిపోతున్నాయని కాంట్రాక్టర్లు అంటున్నారు. ఇకనైనా చదువుకున్న విద్యార్థులను, అనారోగ్యం పాలైన పేషెంట్లను మరియు ప్రజలను దృష్టిలో పెట్టుకొని బ్రిడ్జిని పూర్తి చేయిస్తే బాగుంటుందని జిల్లా కలెక్టర్ కి విన్నపం చేస్తున్నాము.
- సామెలు , తెలంగాణా మాదిగ హక్కుల రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షులు
నిధులు పెండింగ్‌లో ఉన్నందున పనులు ఆగిపోయాయి
మూడు గ్రామాల బ్రిడ్జిల పనులను నుండి రావాలసిన బిల్లులు సుమారు రెండున్నర కోట్లు పెండింగ్ లో ఉన్నందువల్ల పనులు ఆగిపోయాయని కాంట్రాక్టర్ చెప్పాడని, ఆర్ & బి ఏ ఈ అల్టాఫ్ అన్నారు.






