24 March, 2026 | 7:39 PM

ఈ జవహర్‌నగర్‌కు ఏమైంది?

24-03-2026 12:23 AM
  1. డంపింగ్ యార్డ్‌తో ప్రజా జీవనం అల్లకల్లోలం
  2. సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి

జవహర్‌నగర్, మార్చి 23 (విజయక్రాంతి): జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్ దుర్వాసనతో ప్రజాజీవనం అస్తవ్యస్తంగా మారుతుందని స్వచ్ఛమైన గాలి ఆరోగ్యకరమైన జీవితం జవహర్‌నగర్ ప్రజలకు లేదా? ఈ జవహర్‌నగర్‌కు ఏమైంది? అంటూ సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి విమలక్క ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీసర సర్కిల్ జవహర్ నగర్ పరిధిలోని అంబేద్కర్ ప్రధాన చౌరస్తాలో క్రాంతి కళాబృందం ఆధ్వర్యంలో ఈ జవహర్‌నగర్‌కు ఏమైంది? అంటూ క్రాంతి కళాబృందం వ్యవస్థాపకుడు వెంకటాచారి ఆధ్వర్యంలో బహిరంగ సభలు నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి విమలక్క హాజరై మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీ నుంచి గ్రేటర్ హైదరాబాదులో విలీనమైనా జవహర్ నగర్ అభివృద్ధికి నోచుకోవడం లేదని పాలకులే రియల్ బ్రోకర్లుగా అవతారం ఎత్తుతూ పేద ప్రజలను నిలువునా దోచుకుంటున్నారని దుయ్యబట్టారు. డంపింగ్ యార్డ్ రాంకీ సంస్థ ఆగడాలతో జవహర్‌నగర్‌లోని మూడు లక్షల జనాభా ఆరోగ్యం గాల్లో దీపమైందని ఏలనాటి నుండి నివాసం ఉంటున్న భూమిపై హక్కులు ప్రజలు పొందకపోవడం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు.

ప్రభుత్వాలు ప్రజలకు కనీస అవసరాలు తీర్చడంలో విఫలమయ్యాయని దుయ్యబట్టారు. డంపింగ్‌యార్డ్ వల్ల జవహర్‌నగరే కాక చుట్టుపక్కల ప్రాంతాలైన దమ్మాయిగూడ, నాగారం, అహ్మద్‌గూడ,  కీసర, రాంపల్లి, ఘట్కేసర్, చర్లపల్లి తదితర ప్రాంతాలు కాలుష్యంతో కొట్టుమిట్టాడుతున్నాయని పేర్కొన్నారు. 350 బెల్ట్ షాపులతో జవహర్‌నగర్ పూర్తిగా మత్తుమయం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో కాంతి కళాబృందం వెంకటాచారి, మాజీ సర్పంచ్ శంకర్‌గౌడ్, దరువు అంజన్న, మల్లెపూల శ్రీకాంత్‌యాదవ్, దశరథ్, ఎస్.కె మీరా, నిర్మల, అశోక్, సుధాకర్, ముఖేష్, నిహారిక గౌడ్, శ్రీనివాస్, తిరుపతి, ఆంజనేయులు, ప్రకాష్, ప్రజా కళాకారులు తదితరులు పాల్గొన్నారు.