తేజస్వినీ ఆత్మహత్య కేసులో నిజాలు ఏవి.?
మేడిపల్లి,(విజయక్రాంతి): మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బోడుప్పల్ సర్కిల్ మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు రోజుల క్రితం పీర్జాదిగూడ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి తేజస్వీని ఉదంతంపై పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. స్థానికుల వివరాల ప్రకారం.. శంకర్‌నగర్‌లో తేజస్వీని నివాసం ఉంటున్న బిల్డింగ్‌లో చాలా కాలంగా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయి. ఈ బిల్డింగ్‌లో గ్రౌండ్ ఫ్లోర్‌లో బ్యాచిలర్స్, మొదటి అంతస్తులో ఉమ్మడి ఫ్యామిలీ చాలా కాలంగా అద్దెకు ఉంటున్నారు.
కాగా రెండవ అంతస్తు, పెంట్ హౌస్‌లో యాప్ ద్వారా గదులను రోజూవారీగా అద్దెకు ఇస్తున్నారు. ఇందులో రూముల్లోకి వచ్చే వారికోసం సోఫా, బెడ్లు, ఫ్రిజ్, ఏసీ వంటి సకల సౌకర్యాలను యజమాని ఏర్పాటు చేశారు. యాప్ ద్వారా ఈ రూములను బుక్ చేసుకోని రోజుకు రూ.3500 చెల్లిస్తున్నట్లు సమాచారం. అయితే ప్రతిరోజూ కొత్త కొత్త జంటలు రావడం, తమ కార్యకలాపాలు ముగించుకుని పోవడం కొంతకాలంగా పరిపాటిగా సాగుతోంది. ఈ బిల్డింగ్‌లో నివాసం ఉంటున్న ఫ్యామిలీ వారితో సంబంధం లేకుండా నేరుగా లిఫ్ట్‌లో రావడం, తాము బుక్ చేసుకున్న రూమ్‌కి వెళ్లి ఓటీపీ నెంబర్ సహాయంతో డోర్ లాక్ తలుపులు తెరవడం, తమ పనులు పూర్తి కాగానే యథావిధిగా తిరిగివెళ్లిపోవడం పరిపాటిగా సాగుతోంది.
అయితే గత 20 రోజుల క్రితం తేజస్వి ఆమె తల్లితో ఇక్కడికి వచ్చి నెల రోజులకు పేమెంట్ చేసినట్లు విశ్వసనీయ సమాచారం. అయితే తేజస్వీని నిజంగా సాఫ్ట్‌వేర్ ఉద్యోగియేనా అనేది ఇక్కడి స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బెంగళూరులో గతంలో ఉద్యోగం చేసేదని, ఇటీవల మానేసిందని ఆమె తల్లి చెబుతోందని ఇందులో వాస్తవం ఉందా అని ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ సాఫ్ట్ వేర్ ఉద్యోగి మానేసి హైదరాబాద్‌కు ఎందుకు వచ్చిందని, నెలకు రూ. లక్ష అద్దె చెల్లించాల్సిన అవసరం ఏముందని అంటున్నారు. అసలు విజయనగరం నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చింది.
ఈ అసాంఘిక కార్యకలాపాలు చేసే రూమ్ లో ఎందుకు ఉంటోందని పలువురు ప్రశ్నిస్తున్నారు. తేజస్వీకి పీడ కలలు పడుతున్నాయని తల్లి చెబుతోందని, అసలు తేజస్వీ మద్యం సేవించి ఉందా.. లేదా ఏమైనా డ్రగ్స్ తీసుకుని ఉందా అనేది పోలీసులు తేల్చాల్సి ఉందని చెబుతున్నారు. ఇంటి యజమాని అక్రమంగా డబ్బు సంపాదించేందుకు అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఫ్యామిలీలు నివాసం ఉంటున్న చోట ఇలాంటి పాడు పనులు ఏంటని నిలదీస్తున్నారు. యజమాని ఓ బ్రోకర్ ద్వారా ఈ అసాంఘిక కార్యకలాపాలు చేయిస్తున్నాడని స్థానికులు చెబుతున్నారు.






