2 May, 2026 | 2:52 AM

నిరుపేదల సొంతింటి కలలను నిజం చేస్తాం

02-05-2026 01:50 AM

ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

చొప్పదండి, మే1 (విజయక్రాంతి): చొప్పదండి నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడానికి కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పేర్కొన్నారు. గంగాధర మండలం కురిక్యాల గ్రామానికి చెందిన ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులు సముద్రాల కవిత-కిషన్ గృహప్రవేశం కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరైనారు.

ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసిన ఎమ్మెల్యే సత్యం కు సముద్రాల కవిత-కిషన్ దంపతులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో చొప్పదండి నియోజకవర్గం లో రెండేళ్లలోనే అర్హులైన లబ్ధిదారులకు 3500 ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసినట్లు తెలిపారు. కురిక్యాల గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకుని 208 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసినట్లు తెలిపారు. ఇప్పటికే 95 మంది లబ్ధిదారులు సొంత ఇంటిని నిర్మించుకొని గృహప్రవేశం చేసినట్లు తెలిపారు.

రానున్న రోజుల్లో మరింత మందికి ఇందిరమ్మ ఇండ్లను అందజేయడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. చొప్పదండి నియోజకవర్గం లో నిరుపేదల సొంటింటి కలను నిజం చేస్తామని పేర్కొన్నారు. గత బిఆర్‌ఎస్ పాలనలో నిరుపేదల కోసం ఒక్కటంటే ఒక్కటి కూడా కట్టించలేదని గుర్తు చేశారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పేరుతో నాటి కెసిఆర్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని గుర్తు చేశారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, ఇచ్చిన మాట ప్రకారం అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ఇండ్లు రాని నిరుపేదలు ఆందోళన చెందవద్దని, రానున్న రోజుల్లో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ కడారి రేణుక కనకయ్య, కాంగ్రెస్ నాయకులు మేర్జ కొండయ్య, దోర్నాల అర్చన తదితరులు పాల్గొన్నారు.