పెట్రోల్ కృత్రిమ కొరత సృష్టిస్తే... క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం
జవహర్ నగర్ ఏసీపి చక్రపాణి
జవహర్ నగర్,(విజయక్రాంతి): పెట్రోల్ ను కృత్రిమ కొరతగా సృష్టించి వాహనదారులను ఇబ్బందులకు గురి చేస్తున్న బంకు యజమానులపై చర్యలు తీసుకొని క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని జవహర్ నగర్ ఏసిపి చక్రపాణి హెచ్చరించారు. వాహనదారులకు పెట్రోల్ దొరకడం లేదని ఇబ్బందులు పడుతున్నారనే సమాచారం మేరకు జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు బంకులను బుధవారం జవహర్ నగర్ ఏసీపి చక్రపాణి పోలీస్ సిబ్బందితో కలిసి సందర్శించారు.
ఈ సందర్భంగా చక్రపాణి మాట్లాడుతూ... పెట్రోల్ లేదనే వదంతులను ప్రజలు నమ్మవద్దని సరఫరా ఎక్కడ తగ్గలేదని అన్నారు. బంకుల్లో పెట్రోల్ ఉన్నా లేదంటూ నో స్టాక్ బోర్డులు పెడుతున్న వాటిపై ఇప్పటికే ప్రత్యేక నజర్ పెట్టామని సివిల్ సప్లై అధికారులతో తనిఖీ చేస్తున్నామని బంకులను సీజ్ చేస్తామని హెచ్చరించారు. అనంతరం పెట్రోల్ బంకులను సందర్శించి సమస్యలను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో సీఐ సైదులు మరియు డిఐ శ్రీనివాస్, ఎస్ఐలు రామనాయక్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.






