6 June, 2026 | 3:05 AM

భూనిర్వాసితులకు పరిహారమిస్తాం..

06-06-2026 12:00 AM
  1. వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటాం
  2. ధర్మపురి క్షేత్ర అభివృద్ధికి అన్నివర్గాల ప్రజల సహకారం అవసరం
  3. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

ధర్మపురి, మే 5 (విజయక్రాంతి): ధర్మపురి  శ్రీ లక్ష్మీనరసింహ స్వామి క్షేత్ర అభివృద్ధికి భూనిర్వాసితుల అభిప్రా యాలను పరిగణలోకి తీసుకొని ముందుకు సాగుతామని రాష్ట్ర సాంఘీక సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. శుక్రవారం ధర్మపురిలో శ్రీ లక్ష్మీనరసింహ స్వామి క్షేత్ర అభివృద్ధి, పుష్కర ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ తో పాటు అధికారులు, భూనిర్వాసితులతో మంత్రి శుక్రవారం ధర్మపురిలో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భూ నిర్వాసితుల అభిప్రాయాలు పరిగణలోకి తీసుకొని ఎవ్వరిని ఇబ్బంది పెట్టకుండా శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్ర అభివృద్ధికి ముందుకు సాగుతామని తెలిపారు. 2017 -18 భూసేకరణ చట్టం ప్రకారం నిర్వాసితులకు ప్రభు త్వం పరిహారం చెల్లించడానికి సిద్ధంగా ఉందని మంత్రి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. ప్రజా పాలనలో ప్రజలు ఎవ్వరిని ఇబ్బందులకు గురి చేయమన్నారు.

ఇప్పటికే పలుమార్లు భూ నిర్వాసితులతో నెలలుగా చర్చలు జరిపామని శనివారం మరో దఫా చర్చలు నిర్వహిస్తామని మంత్రి అడ్లూరి తెలిపారు. ధర్మపురి క్షేత్ర అభివృద్ధి కోరకు స్థానికులంతా సహక రించాలని ఎవరు క్షేత్ర అభివృద్ధిలో రాజకీయాలు చేయద్దని మంత్రి ఈ సందర్భంగా కోరారు. దేశం నలుమూలల నుండి శ్రీ లక్ష్మి నరసింహ స్వామి క్షేత్రానికి వచ్చే భక్తులకు సౌకర్యాలు కల్పించడమే తమ ప్రధాన ఉద్దేశమని, ఆలయ అభివృద్ధి కొరకు సేకరిస్తున్న భూములు, ఇల్లు కోల్పోతున్న వారు పెద్ద మనసుతో సహకరించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. 

పుష్కరాలకు రూ.117 కోట్లు..

2027 జూన్ లో నిర్వహించే గోదావరి పుష్కరాలకు మొదటి విడతగా ధర్మపురి నియోజకవర్గంలోని ధర్మపురి, కోటి లింగాలకు రూ. 117 కోట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు కేటాయించారని మంత్రి తెలిపారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా బైపాస్ రోడ్లు, పార్కింగ్ స్థలాలు, పుష్కర ఘాట్లు నిర్మిస్తున్నామని మంత్రి తెలిపారు.

మరిన్ని సౌకర్యాల కోసం జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో నేడు నిర్వహించిన సమీక్ష సమావేశంలో ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపిస్తున్నామని త్వరలోనే నిధులు సాధించి పుష్కరాలకు ముందే పనులు పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు. సమీక్ష సమావేశంలో  జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, ధర్మపురి మున్సిపల్ చైర్మన్ వేముల నాగలక్ష్మితో పాటు దేవాదాయ శాఖ అధికారులు, మున్సిపల్ కౌన్సిలర్లు పాల్గొన్నారు.