26 August, 2026 | 4:54 PM

పల్లగుట్టను ధ్వంసం చేస్తే ఊరుకోం

26-08-2026 03:47 PM

* వందల చెట్లు ధ్వంసం చేసిన కాంట్రాక్టర్ 

* వన్యప్రాణులు చెల్లాచెదురవుతాయి.

* ప్రాణాలు పోయిన గుట్టను కాపాడుకుంటాం

* గుట్టపై గూడూరు ప్రజల నిరసన 

ముస్తాబాద్,ఆగస్టు 26( విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం నామాపూర్, గూడూరు  గ్రామాల సరిహద్దు పల్లగుట్ట కాంట్రాక్టర్ ల చేతిలో  అన్యాక్రాంతం కాకుండా కాపాడుకుందామని గూడూరు గ్రామ ప్రజలు ఏకమై బుధవారం ముక్తకంఠంతో నిరసనలు చేపట్టారు. ఈ సందర్బంగా గ్రామస్తులు మాట్లాడుతూ.. "పల్లగుట్ట" మా గూడూరు గ్రామానికి గుండె లాంటిదని పేర్కొన్నారు. గోర్లు, మేకలు, పశువుల మేతకు, ఉపాధి హామీ పనులకు ఈ గుట్టనే ఆధారమని తెలిపారు.

ఈ గుట్టకు ఎన్నో మొక్కలు నాటామని ఇప్పుడు మహా వృక్షాలుగా మారి పెద్ద అడవిలా తలపిస్తుందని వన్యప్రాణులకు ఆహారాన్ని అందిస్తూ నివాస ప్రాయంగా మారిందన్నారు. అనంతరం మాజీ సర్పంచ్ చాకలి రమేష్ మాట్లాడారు. మైనింగ్ కోసమని గతంలో పల్లగుట్టకు 60 ఎకరాల విస్తీర్ణం అనుమతి తీసుకున్నామని కాంట్రాక్టర్ ఈ గుట్టను ధ్వంసం చేయాలని చూస్తే, అందుకు నామాపూర్, గూడూరు రెండు గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టడంతో తన కాంటాక్ట్ పనులు విరమించుకొని వెనక్కి వెళ్లడం జరిగిందని గుర్తు చేశారు.

మళ్ళీ ప్రస్తుతం ఏకంగా జేసీబీతో రోడ్ వేస్తున్నారని తెలిసి కాంట్రాక్టర్ ను అడిగితే మాకు అన్ని విధాలా అనుమతులు ఉన్నాయంటూ మమ్మల్ని బెదిరిస్తున్నాడని వాపోయారు. అసలు ఆ గుట్టపై ఏమి ఉన్నాయో పదే పదే ఎందుకు తవ్వాలని చూస్తున్నారో సందేహం కలుగుతుందన్నారు. వెంటనే ఈ గుట్టను తవ్వాలనే ఆలోచన కాంట్రాక్టర్ మానుకోకపోతే భౌతిక దాడులు చేయడానికి వెనుకాడబోమని, మా ప్రాణాలు పోయిన గుట్టను కాపాడుకుంటామని హెచ్చరించారు.

పచ్చని చెట్లతో ఈ గుట్ట మా గూడూరు గ్రామ ప్రజలకు స్వచ్ఛమైన గాలిని అందిస్తుందని తద్వారా మేమంతా ఆరోగ్యంగా ఉంటున్నామని తెలిపారు. అలాంటిది ఆక్సిజన్ అందించే వందల సంఖ్యలో వృక్షాలను దారి కోసం ధ్వంసం చేయడం జరిగిందన్నారు. వన్యప్రాణులు కూడా చెల్లా చెదురయ్యే ప్రమాదం ఉందన్నారు. గుట్టను తవ్వడం మొదలు పెడితే ప్రజలు అనారోగ్యానికి గురవుతారని ఆవేదన వ్యక్తం చేశారు. గుట్టకు అవతలి వైపు ఉన్న నామాపూర్ లోని రైస్ మిల్లుల నుండి వచ్చే విషవాయువు, బూడిద, ఊకపొట్టు రాకుండా ఈ గుట్ట అడ్డు గోడలా కాలుష్యం నుండి మమ్మల్ని కాపాడుతుందని వెల్లడించారు.

తదుపరి మాజీ సర్పంచ్ వెంకట నర్సింగారావు మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్టం తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు గుట్టను తవ్వడానికి అనుమతి ఇచ్చారన్నారు. కానీ ప్రజల తిరుగుబాటుతో ఉపసంహరించుకున్నారని తెలిపారు. ఇంకుడు గుంతలు, కందకాలు తవ్వించడంతో వర్షాకాలం భూగర్భ జలాలు పెరగడానికి ఈ గుట్ట సత్ఫలితాలు ఇచ్చిందన్నారు. పచ్చగా ఉన్న మా గ్రామాన్ని అంధకారంలోకి నెట్టివేయొద్దని ఈ గుట్టను తవ్వే కార్యక్రమం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ గుట్టను తవ్వడం వలన ఒక్కడికే లాభం కానీ వందల కుటుంబాలు నష్ట పోతాయన్నారు. మాకు 60 ఎకరాలకు అనుమతి ఉన్నా ప్రస్తుతం దాదాపుగా 11 ఎకరాలకు మాత్రమే కుదించి అనుమతి తెచ్చుకున్నామని కాంట్రాక్టర్ చెప్పడం జరిగిందని లెటర్ కూడా గ్రామ పంచాయతీలో ఇచ్చినట్లు తెలిపారన్నారు. కానీ ఒక్క అంగుళం కూడా తవ్వడానికి ఒప్పుకోమని గ్రామ ప్రజలతో కలిసి సంబంధిత అధికారులను కలిసి పర్యావరణం కాపాడుకుంటామని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.