సాంకేతికతను వినియోగించుకోవాలి
అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్
మేడ్చల్, జూలై 22 (విజయ క్రాంతి): ప్రభుత్వ ఉద్యోగులు రోజువారి విధులలో భాగంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (కృత్రిమ మేధస్సు) ను వినియోగించుకోవాలని అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ అన్నారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులకు, కలెక్టరేట్ సిబ్బందికి ఏర్పాటు చేసిన ఎఐ శిక్షణ కార్యకమానికి డిఆర్‌ఓ మాలతితో కలిసి హాజరైనారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ మొదటి పారిశ్రామిక విప్లవం స్టీమ్ ఇంజన్, రెండవ పారిశ్రామిక విప్లవం విద్యుత్ ఆవిష్కరణ, మూడవది డిజిటలైజేషన్‌అంటే కంప్యూటర్ ఆవిష్కరణ, ఇక నాలుగవది ప్రస్తుత యుగం ఏఐ విప్లవంఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (కృత్రిమ మేధస్సు), అందులో భాగంగా చాట్జీపీటీ వంటి ఏఐ టూల్స్ అన్ని రంగాల్లోనూ విస్తరిస్తున్నాయన్నారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా గతంలో పనులు ఎలా జరిగాయో అధ్యయనం చేసి, తదుపరి చర్యలను ముందుగానే ఊహించి, తదనుగుణంగా ఆఫీస్ ఫైళ్ల నిర్వహణ, ఆఫీసుల్లో ప్రతిరోజూ డ్రాఫ్టింగ్, నోటింగ్ వంటి పనులు, ఫైల్ మూవ్మెంట్ వంటి పనులను సులభతరం చేస్తుందన్నారు. డ్రాప్టింగ్ లలో జరిగే వ్యాకరణ దోషాలు లేదా స్పెల్లింగ్ తప్పులనుఈ ఏఐ ద్వారా సరిచేసుకోవచ్చాన్నారు.
ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించి పోస్టర్లు, పాంప్లెట్లు, లేదా ఫ్లెక్సీ బ్యానర్లు డిజైన్ చేయడానికి ఈ టూల్స్ అద్భుతంగా పనిచేస్తాయన్నారు. ఏఐ ఒక సహాయకారి మాత్రమే కాని ప్రత్యామ్నాయం కాదని ఏఐ టూల్స్ ఎంతో ఉపయోగపడినప్పటికీ, వాటిని 100% గుడ్డిగా నమ్మకూడదని తెలిపారు.
ఏ ఐ ఇచ్చిన సమాచారాన్ని తప్పనిసరిగా ఒకసారి సరిచూసుకోవాలని ఏ ఐ టూల్స్ ఇంకా అభివృద్ధి చెందుతున్న దశలోనే ఉన్నాయన్నారు. మానవ మేధస్సును మించిన ఆర్టిఫిషియల్ టూల్ కానీ, యంత్రం కానీ ప్రపంచంలో ఏదీ లేదని స్పష్టం చేసారు.






