కుప్పలు పోసుకున్నాం..కనికరించండి
కొనుగోలు లేక రైతుల పడిగాపులు.. వెంటనే కొనుగోలు చేయాలి
తాడ్వాయి, మార్చి,1 (విజయ క్రాంతి): రైతులు ఎంతో కష్టపడి పండించిన ధాన్యాన్ని తామే కొనుగోలు చేసి రైతులకు మద్దతు ధర అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీనిలో భాగంగానే ప్రత్యేకంగా మక్కలు కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసింది. కానీ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసినంత ఉత్సాహం రైతుల మక్కలు కొనుగోలు చేయడంలో చూపడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు,కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలో రైతులకు మద్దతు ధర అందించి రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో రెండవసారి మక్కల కొనుగోలు కేంద్రాన్ని అధికారులు ప్రారంభించారు.
మొదటిసారి మక్కలు కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి పూర్తిస్థాయిలో రైతుల నుంచి మక్కలు కొనుగోలు చేయలేదు. దీంతో రైతుల వద్ద మక్కలు మిగిలిపోయి ఉన్నాయి. పూర్తిస్థాయిలో రైతుల నుంచి మక్కలు కొనుగోలు చేయకుండానే మధ్యలోనే కొనుగోలు కేంద్రాన్ని నిలిపివేశారు. దీంతో రెండవసారి మక్కల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని రైతులు ఆందోళన చేపట్టారు ఈ విషయమై పలుమార్లు రైతులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు.
ఖచ్చితంగా తాడ్వాయిలో మక్కలు కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాల్సిందేనని పట్టుబట్టారు. బయట దళారులకు మక్కలను విక్రయిస్తే నష్టపోతున్నామని తెలిపారు. ఈ విషయాన్ని పరిశీలించిన స్థానిక ఎమ్మెల్యే కె మదన్మోహన్ రైతుల విజ్ఞప్తిని మన్నించి అధికారులతో మాట్లాడి రెండవసారి మక్కలు కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయించారు. కానీ మక్కలు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన సదరు బాధ్యత గల అధికారులు సకాలంలో మక్కలను రైతుల నుంచి కొనుగోలు చేయడం లేదు. దీంతో రైతులు రైతులు అధికారులపై మండిపడుతున్నారు. వెంట వెంటనే మక్కలు కొనుగోలు చేయకపోవడంతో కుప్పలు పోసుకొని కొనుగోలు కేంద్రం వద్ద పడి కాపులు కాస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రత్యేక కొనుగోలు కేంద్రం ఏర్పాటుతో రూ. 30 కోట్ల లబ్ది
రైతులకు రెండవసారి మక్కలు కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి మక్కలు కొనుగోలు చేయడంతో తాడ్వాయి మండలంలోని రైతులకు రూ.30 కోట్ల లబ్ధి చేకూరనుంది. బయట దళారులకు మక్కలు విక్రయిస్తే క్వింటాల్ కు రూ 500 నష్టపోయే అవకాశం ఉంది. రూ.500 నష్టాన్ని నివారించడం కోసమే రైతుల విజ్ఞప్తి మేరకు అధికారులు రెండవసారి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.
కానీ ప్రారంభించిన రైతులు నుంచి వెంట వెంటనే మక్కలు కొనుగోలు చేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.మండలంలోని కృష్ణాజివాడి, తాడువాయి,కన్ కల్, కరడ్ పల్లి,నందివాడ, ఎర్ర పహాడ్, చిట్యాల గ్రామాల నుంచి రైతులు మక్కలు తీసుకుని వచ్చి కేంద్రాల వద్ద కుప్పలుగా పోసుకున్నారు. కుప్పలు పోసుకొని 15 రోజులు అవుతున్న అధికారులు మక్కలు కొనుగోలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే మక్కలు కొనుగోలు చేసి రైతులకు సకాలంలో డబ్బులు అందించాలని కోరుతున్నారు.
కాంటా చేసిన మక్కలు తరలించడం లేదు
అధికారులు రైతులు తీసుకొచ్చిన మక్కలను కాంటా చేసిన ఇక్కడి నుంచి తరలించడం లేదు. తామే మక్కల వద్ద కాపలా కాస్తున్నాం. రాత్రి సమయంలో ఇక్కడే వచ్చి పడుకుంటున్నాం. చాలా ఇబ్బందిగా ఉంది. అధికారులు స్పందించి వెంటనే మక్కలు కొనుగోలు చేసి ఇక్కడి నుంచి తరలించాలి. వెంటనే రైతుల ఖాతాలో డబ్బులు జమ చేయాలి.ఇప్పటికైనా అధికారులు స్పందించాలి.
- బద్దం గంగారెడ్డి,రైతు, కృష్ణాజువాడి




