రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నాం
మీరు చేసిన అప్పులకు వడ్డీలు కడుతున్నాం
అందుకు ధన్యవాదాలు చెప్పాలి
పదేళ్లు ప్రజలను మోసం చేసినందుకు మీరు క్షమాపణ చెప్పాలి
కేటీఆర్‌కు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కౌంటర్
హైదరాబాద్, మార్చి 17 (విజయక్రాంతి): లక్షల కోట్లతో అప్పుల బారిన పడిన ఈ రాష్ట్రాన్ని తాము వడ్డీలు కడుతూ గాడిలో పెడుతున్నామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టులు, రిజర్వాయర్లు లేవు.. భూసేకరణ సరిగ్గా చేయకుండానే లక్షల కోట్ల అప్పులు చేశారని విమర్శించారు. ఈ రెండున్నర సంవత్సరాల్లో రూ.3.25 లక్షల కోట్ల అప్పులకు వడ్డీలు కట్టి రాష్ట్రాన్ని గాడిన పెడుతున్నామని చెప్పారు.
అసెంబ్లీలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు కౌంటర్‌గా మంత్రి వెంకట్‌రెడ్డి మాట్లాడారు. కేటీఆర్ ఖచ్చితంగా తమ ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పాలని, మీరు ఇవ్వని తెల్ల రేషన్ కార్డులు, సన్న బియ్యం తాము ఇస్తున్నామని, అందుకు మాకు ధన్యవాదాలు చెప్పాలన అన్నారు. రూ.20 వేల కోట్లతో కులమతాలకు అతీతంగా ఇంటర్నేషనల్ స్థాయిలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తున్నామని, అందుకు ధన్యవాదాలు చెప్పాలని పేర్కొన్నారు.
ఆడ బిడ్డలు గుడికి, బడికి ఎక్కడికి పోయిన గౌరవంగా ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం చేస్తున్నారని, రూ.11 వేల కోట్లు ఆర్టీసీకి చెల్లించామని, ఆడబిడ్డలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించినందుకు ధన్యవాదాలు చెప్పాలని తెలిపారు. ఏ గ్రామానికి పోయినా ఒక్కో ఇంటికి రూ.5 లక్షలు ఇస్తూ 30 నుంచి 40 ఇందిరమ్మ ఇండ్లు కడుతున్నందుకు తమ ప్రభుత్వానికి తప్పకుండా ధన్యవాదాలు చెప్పాలని పేర్కొన్నారు.
మీకు ఎందుకు ధన్యవాదాలు చెప్పాలి.. దళితున్ని ముఖ్యమంత్రిని చేస్తా అన్నందుకు చెప్పాలా? డబుల్ బెడ్రూం ఇళ్లు ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్పాలా? అని ప్రశ్నించారు. కేటీఆర్ ఓపిగా తెచ్చుకొని తాము చెప్పేది వినాలని హితవుపలికారు. తాము మొదటగా పేదవాళ్లకు మంచి చేసే కార్యక్రమాలు చేస్తున్నామని, ఈ కార్యక్రమాలు చేసినందుకు తమకు ధన్యవాదాలు చెప్పాలన్నారు. పదేళ్లు తెలంగాణ ప్రజలను మోసం చేసినందుకు మీరు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌చేశారు.




