ఖబడ్దార్ నాగేందర్.. తేల్చుకుందాం రా
ఎమ్మెల్యే కాలే యాదయ్య సవాల్
చేవెళ్ల, జూన్ 13 (విజయక్రాంతి): తనపై వస్తున్న ఆరోపణలను చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య తీవ్రంగా ఖండించారు. శనివారం చేవెళ్లలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ... మాజీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ పుణ్యాన రాజకీయాల్లో ఎదిగి, ఆయనకే వెన్నుపోటు పొడిచిన చరిత్ర నాగేందర్ గౌడ్దని మండిపడ్డారు. మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డికి నాగేందర్ గౌడ్ తప్పుడు సమాచారం అందించి ఆమె స్థాయిని దిగజారుస్తున్నారని విమర్శించారు.
అవినీతి, నేర చరిత్రపై ధ్వజం నాగేందర్ గౌడ్ దంపతుల పదవీ కాలంలో జరిగిన అవినీతిని ప్రజలు మరిచిపోలేదని యాదయ్య గుర్తుచేశారు. ‘టీడీపీ హయాంలో ఇళ్లు, ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి కోట్ల రూపాయలు వసూలు చేసింది నిజం కాదా? విద్యా మౌలిక సదుపాయాల కమిటీ చైర్మన్గా ఉండి ఎంతమంది దగ్గర డబ్బులు గుంజారో నేను నిరూపిస్తా.
నేను ఎక్కడైనా వంద రూపాయలు తీసుకున్నట్లు నిరూపిస్తే నా పదవికి రాజీనామా చేస్తా‘ అని సవాల్ విసిరారు. అంతేకాకుండా, గతంలో నవాబ్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన కొత్తపల్లి నరసింహులు, ఆయన తమ్ముడు యాదయ్యల హత్యల వెనుక ఎవరి హస్తం ఉందో రికార్డుల్లో స్పష్టంగా ఉందన్నారు.
మూలమాడ ఘటనపై వివరణ..
మూలమాడ గ్రామంలో జరిగిన గొడవ పూర్తిగా బీజేపీకి చెందిన సర్పంచ్ నరేందర్ రెడ్డి భార్య, కాంగ్రెస్కు చెందిన ఉపసర్పంచ్ నరసయ్య భార్య వర్గాల మధ్య జరిగిందని.. ఇందులో బీఆర్‌ఎస్ ప్రమేయం ఎక్కడుందని ప్రశ్నించారు. బాధిత మాల సామాజిక వర్గంపై 200 మందితో దాడి చేయించి, తిరిగి వాళ్లపైనే పోలీసులతో ’307’ కేసు పెట్టించారని ఆరోపించారు. ఒక సామాజిక వర్గానికి అన్యాయం జరిగిందనే తాను అక్కడికి వెళ్లానని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.
పరామర్శకు వస్తే ఇరువర్గాలను పరామర్శించాలి కానీ, బీఆర్‌ఎస్కు ఓటు వేయని వారి కోసం సబితా రెడ్డి అక్కడకు ఎందుకు వచ్చారని ప్రశ్నించారు.ఈ విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు బండారి ఆగిరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ దేవర వెంకటరెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్ మద్దెల శ్రీనివాస్, మంగళ యాదగిరి, టేకులపల్లి శ్రీనివాస్ యాదవ్, గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.






