08-02-2026 01:57:45 AM
ఓటుకు నోటు ఫైళ్లు బూడిదయ్యాయా.. బుగ్గి చేశారా?
ఫోరెన్సిక్ ల్యాబ్‌లో అగ్ని ప్రమాదంపై ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కామెంట్స్
హైదరాబాద్, ఫిబ్రవరి 7 (విజయక్రాంతి) : నాంపల్లిలోని ఫోరెన్సిక్ ల్యాబ్‌లో జరిగిన అగ్ని ప్రమాదం యాదృచ్ఛికమా లేక పక్కా ప్రణాళికా అని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ అనుమానం వ్యక్తం చేశారు. ఓటుకు నోటు కేసు ఫైళ్లు బూడిదయ్యాయా లేక బుగ్గి చేశారా అని ప్రశ్నించారు. ఈ మేరకు శనివారం ట్విట్టర్ వేదికగా ఆయన స్పందించారు.
ఓటుకు నోటు కేసు వంటి అత్యంత కీలకమైన ఫైళ్లు ఉన్న సెక్షన్‌లోనే షార్ట్ సర్క్యూట్ జరగడం యాదృచ్ఛికమంటే ఎవరూ నమ్మరని, ఇది సాంకేతిక లోపం కాదా.. సాక్ష్యాలను తుడిచిపెట్టే పక్కా ప్లాన్ అని స్పష్టంగా అర్థమవుతోందని వెల్లడించారు. మంటలు అంటుకున్నది ఫైళ్లకు కాదని, రాష్ట్ర ప్రజాస్వామ్య విలువలకు అని విమర్శించారు. ఈ ఘటన వెనుక ఉన్న కుట్రదారులు ఎవరో తేలాలంటే హైకోర్టు సిట్టింగ్ జడ్జీతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో అత్యంత భద్రత ఉండాల్సిన ఫోరెన్స్‌క్ ల్యాబ్‌కే రక్షణ లేకపోతే ఇక సామాన్యుడికి న్యాయం ఎక్కడ దొరుకుతుందని ప్రశ్నించారు. ఈ ప్రమాదంపై తక్షణమే నిష్పక్షపాత విచారణ జరపకపోతే ఈ నేరంలో ప్రభుత్వ భాగస్వామ్యం కూడా ఉందని అనుకోవాల్సి వస్తుందని తెలిపారు. క్లౌడ్ బ్యాకప్ నుంచి డేటాను రికవర్ చేసి ఏయే ఫైళ్లు సేఫ్‌గా ఉన్నాయో శ్వేతపత్రం విడుదల చేయాలని, భద్రతా వైఫల్య బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.