10 April, 2026 | 3:45 AM

రైతుల ప్రయోజనాల కోసమే గోదాముల నిర్మాణం

10-04-2026 12:00 AM

తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు

తుంగతుర్తి, ఏప్రిల్ 9గ్రామాల్లోని రైతుల ప్రయోజనాల కోసమే గోదాముల నిర్మాణం ప్రభుత్వం చేపట్టినట్లు, వీటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు అన్నారు. గురువారం మండల పరిధిలోని వెలుగుపల్లి గ్రామం శివారులో గల రుద్రమ్మ చెరువు వద్ద రూ.10 కోట్ల వ్యయంతో నూతన గిడ్డంగులు ఏర్పాటు కార్యక్రమంలో భూమి పూజ చేపట్టారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో అడ్డగూడూరు కేంద్రంలో నూతనంగా పారిశ్రామిక కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. నియోజకవర్గానికి అదనంగా 2000 నూతన ఇందిరమ్మ ఇండ్లు, ఉచిత మహాలక్ష్మి పథకం, రూ.500 కే గ్యాస్, సన్న బియ్యం పంపిణీ, పేద ప్రజల గుండెల్లో అభివృద్ధి పథకాలు నిలిచిపోయాయన్నారు.

మద్దిరాల నూతనకల్ మండలాల నడుమ నూతనంగా జూనియర్ కాలేజ్ ఏర్పాటుకు కృషి చేయనున్నట్లు తెలిపారు. వెలుగు పల్లి గ్రామానికి సుమారు గడిచిన రెండు సంవత్సరాల కాలంలో కోటి రూపాయలకు పైగా వ్యయంతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షులు గుడిపాటి నరసయ్య, రైతు సంక్షేమ కమిషన్ సభ్యులు చెవిటి వెంకన్న యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ తీగల గిరిధర్ రెడ్డి వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.