calender_icon.png 23 February, 2026 | 9:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రక్తదానం చేసి మానవత్వం చాటిన వార్డు సభ్యుడు మహేష్

23-02-2026 06:04:58 PM

కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తహీనతతో బాధపడుతున్న ఓ మహిళకు సమయానికి రక్తం అందక ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో మండలంలోని ఎదులవాడ గ్రామపంచాయతీ వార్డు సభ్యుడు మహేష్ మానవత్వాన్ని చాటుకున్నారు. సోషల్ మీడియాలో మహిళ ఆరోగ్య పరిస్థితిపై వచ్చిన సమాచారం తెలుసుకున్న వెంటనే స్పందించిన ఆయన, ఆసుపత్రికి చేరుకుని స్వచ్ఛందంగా రక్తదానం చేసి ప్రాణదాతగా నిలిచారు.

రక్తహీనతతో బాధపడుతున్న మహిళకు అత్యవసరంగా రక్తం అవసరమని వైద్యులు సూచించగా, ఆలస్యం చేయకుండా ముందుకు వచ్చిన మహేష్ తన బాధ్యతను సామాజిక సేవగా భావించి రక్తం అందించారు. ఆయన చర్యతో మహిళ ఆరోగ్య పరిస్థితి స్థిరపడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మహేష్ చేసిన ఈ సేవాస్ఫూర్తిని స్థానిక ప్రజలు, యువకులు, ఆసుపత్రి సిబ్బంది అభినందించారు.

ప్రజా ప్రతినిధులు కేవలం పరిపాలనా కార్యక్రమాలకు మాత్రమే కాకుండా, అవసరమైన సమయంలో ముందుండి సేవ చేయాలని ఆయన నిరూపించారని పేర్కొన్నారు. రక్తదానం మహాదానం అనే నినాదాన్ని సార్థకం చేస్తూ సమాజానికి ఆదర్శంగా నిలిచిన మహేష్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. అవసర సమయంలో ఒక్క అడుగు ముందుకు వేస్తే ఒక ప్రాణం కాపాడవచ్చని, ప్రతి ఒక్కరూ స్వచ్ఛంద రక్తదానానికి ముందుకు రావాలని పలువురు పిలుపునిచ్చారు.