7 June, 2026 | 2:58 AM

ఏసీబీకి చిక్కిన వక్ఫ్‌బోర్డు ఇన్‌స్పెక్టర్

07-06-2026 12:05 AM

రూ.10వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఉద్యోగి

నల్లగొండ క్రైం, జూన్ 6 (విజయక్రాంతి) : లంచం తీసుకుంటూ వక్ఫ్ బోర్డు ఇన్‌స్పెక్టర్ శనివారం ఏసీబీకి దొరికిపోయాడు. నల్లగొండ జిల్లా పెద్దవూర మండలంలోని 900 గజాల స్థలంలో మసీదు ఖాళీ స్థలం వివాదం విషయమై సర్వే చేసి వక్ఫ్ బోర్డుకు నివేదిక ఇచ్చేం దుకు రూ.10 వేలు లంచం డిమాండ్ చేయడంతో మసీద్ అధ్యక్షుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఏసీబీ అధికారులు ప్లాన్ ప్రకారం మిర్యాలగూడ బస్టాండ్‌లో శనివారం మహమూద్ లంచం తీసుకుంటుం డగా పట్టుకున్నారు.

దాతలు ఇచ్చిన మసీదు భూమి సర్వే రిపోర్టు పంపేందుకు మహమూ ద్ డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేసినట్టు అధికారులు నిర్ధారించారు. మసీదు, ఖాళీ స్థలం వివాదంపై 2025 ఫిబ్రవరిలో వక్ఫ్ బోర్డు సీఈవోకు మసీద్ అధ్యక్షులు వినతిప త్రం అందజేశారు. దీంతో నివేదిక పంపాలని వక్ బోర్డు ఇన్‌స్పెక్టర్‌ని సీఈఓ ఆదేశించారు.

సర్వే పూర్తయినా  సీఈఓకు రిపోర్టు పంపకుండా కాలయాపన చేస్తూ  లంచం ఇవ్వాలని డిమాండ్ చేశాడు.మిర్యాలగూడలోని ఆయన నివాసంలో, నల్లగొండలోని కార్యాలయంలో తనిఖీలు చేశారు. ఆదాయానికి మించిన ఆస్తులున్నాయా అనే విషయమై దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీబీ డీఎస్పీ జగదీష్ చందర్ తెలిపారు. హైదరాబాద్ నాంపల్లి కోర్టు కు రిమాండ్ తరలిస్తున్నట్లు అయన తెలిపారు.