7 June, 2026 | 1:22 AM

పంటల మార్పిడితోనే లాభసాటి వ్యవసాయం

07-06-2026 12:03 AM

రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి

హైదరాబాద్, జూన్ 6 (విజయక్రాంతి): రాష్ట్రంలో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలంటే పంటల మార్పిడి అనివార్యమ ని తెలంగాణ వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ స్పష్టం చేసింది. పంటల వైవిధ్యీకరణపై కమిషన్ రూపొందించిన సమగ్ర నివేదికను శనివారం బీఆర్‌కే భవన్‌లో కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి విడుదల చేశారు.

ఈ కార్యక్రమంలో కమిషన్ సభ్యులు రాములు నాయక్, కేవీఎన్ రెడ్డి, గోపాల్ రెడ్డి, గడుగు గంగాధర్, భవానీరెడ్డి, మెంబర్ సెక్రటరీ గోపాల్, స్పెషల్ అధికారి కేశవులు పాల్గొన్నారు. ఈ సందర్భం గా కోదండరెడ్డి మాట్లాడుతూ, కేరళ, మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లో అధ్యయనం చేసి పంటల మార్పిడిపై నివేదిక సిద్ధం చేసినట్లు తెలిపారు.

గత నెల 4న సీఎం రేవంత్ రెడ్డితో జరిగిన సమావేశంలో పంటల మార్పిడిపై సుదీర్ఘంగా చర్చించామని, కమిషన్ నివేదికను ముఖ్యమంత్రికి అందజేశామని చెప్పారు. దీనిపై లోతైన అధ్యయనం చేయాలని సీఎం సూచించినట్లు వెల్లడించారు. వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు కూడా నివేదిక కాపీని అందజేసినట్లు పేర్కొన్నారు.