కారేగాం,హంగార్గ ఇసుక క్వారీలను నిలిపివేయాలంటూ గ్రామస్తులు, రైతుల ఆందోళన
ఎక్కడికక్కడ నిలిచిపోయిన ఇసుక లారీలు...
ఇసుక క్వారీని నిలిపివేయకుంటే ఆందోళనలు ఉదృతం చేస్తాం... గ్రామస్తుల హెచ్చరిక...
బాన్సువాడ,(విజయక్రాంతి): నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండలం కారేగాం, హంగార్గ గ్రామాల శివారులో ఇసుక క్వారీలో తవ్వకాలను నిలిపేయాలని గ్రామస్థులు, రైతులు బుధవారం ఇసుక క్వారీలో ఆందోళన చేపట్టారు. లారీలను ఎక్కడికక్కడ నిలిపివేశారు.ఈ సందర్భంగా పోతంగల్ మండలం కారేగాం గ్రామ సర్పంచ్ సునీల్ మాట్లాడుతూ మంజీర పరిసర ప్రాంతాల్లో కొన్ని వేల ఎకరాల్లో పంటలు పండుతున్నాయన్నారు.
అయితే ఇసుకను అక్రమంగా తోడేస్తూ ఉంటే మంజీర కొన్నిరోజుల్లో ఎడారిలో మారిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పెడచెవిన పెడుతున్నారని.. ఫిర్యాదులు ఇచ్చిన అనంతరం కొన్నిరోజులుకు వచ్చి తూతూమంత్రంగా తనిఖీలు చేసి వెళ్లిపోతున్నారని వాపోయారు. మంజీరను కాపాడుకోవాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. ఇసుకను నిరంతరాయంగా తోడేస్తే చుట్టుపక్కల ఉన్న బోర్లన్నీ ఎత్తిపోతాయన్నారు.
మాజీ సర్పంచ్ సాంబశివరావు మాట్లాడుతూ తక్షణమే కారేగాం హంగార్గ ఇసుక క్వారీ నుంచి జేసీబీలు, లారీలు వెళ్లకపోతే తీవ్రమైన చర్యలుంటాయని హెచ్చరించారు. అలాగే అనుమతుల పేరుతో రాత్రి 9 గంటల తర్వాత కూడా యథేచ్ఛగా ఇసుకను అక్రమంగా తోడుతున్నారని చెప్పారు. భూగర్భ జలాలు అడుగంటిపోయి పంట పొలాలకు సాగునీరు రాక రైతులు రోడ్డున పడాల్సిన దుస్థితి నెలకొంటుందని గ్రామస్తులు రైతులు వాపోతున్నారు. ఇప్పటికైనా వెంటనే ఉన్నతాధికారులు స్పందించి పుష్క క్వారీలను నిలిపివేయాలని రైతులను ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.






