హయత్ ఇండియా, సౌత్ వెస్ట్ ఏషియా ప్రెసిడెంట్ గా వికాస్ చావ్లా
షికాగో: ప్రముఖ దిగ్గజ కంపెనీ హయత్ హోటల్స్ కార్పొరేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. నాయకత్వ మార్పులో భాగంగా భారతదేశంలో వ్యాపార వృద్ధిలో తర్వాతి దశను ప్రకటించింది. ఇండియాలో తమ పరిధిని పెంచుకునే క్రమంలో కొత్తగా తీసుకొచ్చిన ప్రెసిడెంట్ ఇండియా , సౌత్‌వెస్ట్ ఏషియా' అనే సీనియర్ పదవికి వికాస్ చావ్లాను నియమించింది.తద్వారా అత్యంత వ్యూహాత్మక వృద్ధి మార్కెట్లలో ఒకటైన భారతదేశంలో విస్తరణను వేగవంతం చేయడానికి, తన బ్రాండ్ ఉనికిని మరింత బలోపేతం చేయడానికి ఈ నియామకం కీలకం కానుందని హయత్ భావిస్తోంది.
పలు కీలక పట్టణాలు, టారిజం స్పాట్స్ లో తన పోర్ట్‌ఫోలియోను విస్తరిస్తున్న నేపథ్యంలో వికాస్ చావ్లా నియామకం కంపెనీకి సరికొత్త ఉత్సాహం తెస్తుందని భావిస్తోంది. నాలుగు దశాబ్దాలకు పైగా, హయత్ భారతదేశంలో ఒక బలమైన పునాదిని నిర్మించుకుందనీ, తర్వాత వృద్ధి దశలోకి ప్రవేశిస్తున్న సందర్భంలో వికాస్ చావ్లా లాంటి విస్తృతమైన అనుభవం ఉన్న వ్యక్తి దానిని మరింత ముందుకు తీసుకువెళతారన్న నమ్మకం ఉందనీ హయత్ ఆసియా పసిఫిక్ గ్రూప్ ప్రెసిడెంట్ డేవిడ్ ఉడెల్ చెప్పారు.
ఆహారం, పానీయాలు, కన్సల్టింగ్‌లో 30 ఏళ్లకు పైగా నాయకత్వ అనుభవం ఉన్న వికాస్ చావ్లా తన కొత్త బాధ్యతలపై స్పందించారు. ‘భారతదేశంలో హయత్ తన వ్యాపార పరిధిని విస్తరించుకుంటున్న సమయంలో తాను ఈసంస్థలో చేరడం సంతోషంగా ఉందన్నారు. హయత్ పోర్ట్‌ఫోలియోను మరింత అభివృద్ధి చేసి, భారతదేశంలోని వివేకవంతులైన ప్రయాణికులలో అత్యంత ప్రాధాన్యత కలిగిన ఆతిథ్య బ్రాండ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు వికాస్ చావ్లా వెల్లడించారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, హయత్ ముంబై, బెంగళూరు, న్యూఢిల్లీ , హైదరాబాద్ వంటి కీలక గేట్ వే మార్కెట్లలో తన బ్రాండ్ ఉనికిని బలోపేతం చేసుకోవడంపై దృష్టి పెట్టింది.




